ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు.. హామీలు, పెన్షన్లు, ఉద్యోగాలపై ఇప్పటికే వరుస లేఖలు రాసిన ఆయన.. తాజాగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అమరావతి రాజధాని అంశంపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రిని కోరారు రఘురామ. ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటుకు వ్యతిరేకం కాదని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోనిదని, 30వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే చాలని మీరే ప్రకటించారని లేఖలో గుర్తు చేశారు. అమరావతిలో ఇల్లు నిర్మించుకుని మరీ ప్రజలకు నమ్మకం కలిగించారని.. మాట తప్పరు మడమ తిప్పరు అని మీకున్న పేరు నిలబెట్టుకోవాలని సీఎం జగన్‌కు లేఖ రాశారు రఘురామ. ఎన్నికలయ్యాక మాట మారిస్తే ప్రజలకు ఇచ్చిన హామీని వమ్ము చేయడమేనన్నారు.
రాజధాని కోసం 30వేల ఎకరాలు అందించి భవిష్యత్తుపై ఆశతో ఉన్న రైతులను తీవ్రంగా దెబ్బతీశారన్నారు. దక్షిణాఫ్రికా తరహా మూడు రాజధానులు అనే ఆలోచన సరికాదన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, స్థానిక స్వపరిపాలన ద్వారా మాత్రమే సమగ్ర అభివృద్ధి సిద్ధిస్తుందని ఎంపీ రఘురామ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com