AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా, కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇతను ఈ కేసులో A1గా ఉన్న కసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా సిట్ గుర్తించింది. బుధవారం (జులై 30, 2025) ఉదయం వరుణ్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇటీవల హైదరాబాద్ సమీపంలోని ఒక గెస్ట్‌హౌస్‌లో రూ. 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు, ఏపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పీఏలు బాలాజీ, నవీన్‌లను కూడా సిట్ బృందం ఇండోర్‌లో అదుపులోకి తీసుకుంది. గతంలోనే వీరిద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన సిట్, ఎట్టకేలకు పట్టుకుంది. వీరు ఎన్నికల సంఘం గతంలో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో నగదుకు సంబంధించినవారుగా చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందికి పైగా నిందితులను సిట్ అరెస్టు చేసింది. వారిలో వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ మాజీ కార్యదర్శి కె. ధనుంజయ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రికి ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పీఏ దిలీప్ కుమార్, చానిక్య తదితరులు ఉన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com