పింఛన్లపై ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వార్‌

పింఛన్లపై ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వార్‌

నాలుగో రోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసాబాసగా సాగాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభను విపక్ష సభ్యులు అడ్డుతగులుతున్నారని అధికార నేతలు ఫైర్ అయ్యారు. గత మూడు రోజుల మాదిరిగానే టీడీపీ సభ్యుల్ని స్పీకర్‌ ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బాల వీరాంజనేయులు, రామకృష్ణబాబు, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్‌, అశోక్‌, రామరాజు సస్పెండ్ అయినవారిలో ఉన్నారు.

సభలో దిశ బిల్లును సవరణ చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని టీడీపీ వ్యతిరేకించింది. గతంలో ప్రవేశపెట్టిన దిశ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. పలు సవరణలు చేశారు. అయితే.. దీనిపై చర్చకు టీడీపీ సభ్యులు కోరగా స్పీకర్ తమ్మినేని అవకాశం ఇవ్వలేదు. టీడీపీ సభ్యుల చర్చకు పట్టుబట్టినా... సభలో దిశ సవరణ బిల్లును హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టారు. దీనిపై టీడీపీ సభ్యులు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. స్పీకర్‌ తీరుకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

పింఛన్లపై ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. సంక్షేమం పేరుతో ప్రజపై భారాన్ని మోపుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 3 వేలు పింఛన్ ఇస్తామని చెప్పి... ప్రతీ ఏటా 250 పెంచుతున్నారని.. ఆ లెక్కన ఈ ఏడాది పెంచలేదన్నారు. దీంతో పేదలు వేల రూపాయలు నష్టపోయారని నిమ్మల అన్నారు.

రాష్ట్రంలో ఆస్తి పన్ను పెంచుతూ.. రూపొందించిన మున్సిపల్ సవరణ బిల్లుపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆస్తి పన్నును ఎంత శాతం పెంచుతున్నారనే అంశాన్ని బిల్లులో ప్రస్తావించలేదని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. రిజిస్ట్రేషన్‌ విలువ మీద పెంచాలని నిర్ణయించడం ద్వారా భారీగా పన్ను పెరుగుతుందన్నారు. పేదలపై భారం పడకుండానే ఆస్తి పన్ను పెంచుతున్నామని మంత్రి బొత్స అన్నారు. ఆతర్వాత.. మున్సిపల్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

మొత్తంగా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు విపక్ష సభ్యుల ఆందోళనలతో హోరెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరును సభలో ప్రస్తావిస్తూ... వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. దీంతో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.Tags

Next Story