Chandrababu: ఈ నెల 10న ఏపీ క్యాబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో చర్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను సీఎస్ అదేశించారు. నిర్దేశిత నమూనాలో ప్రతిపాదనలను ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు సాధారణ పరిపాలనా శాఖకు అందించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ క్యాబినెట్ భేటీ అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలపైనా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకంతో పాటు పీ – 4 కార్యక్రమం అమలు వంటి అంశాలపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. చెత్తపై విధించిన పన్ను రద్దును క్యాబినెట్ లో ఆమోదించనున్నారు.
జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటుపైనా చర్చించనున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ పైనా కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇప్పటికే ఏపీ టెట్ పరీక్షలు ఈ నెల 3 నుండి ప్రారంభమయ్యాయి. పరీక్షలు అయిన వెంటనే డిసెంబర్ లో డీఎస్సీ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వీటితో పాటు జిల్లాల వారీగా అభివృద్ధి అంశాలు, కొత్తగా చేపట్టబోయే కార్యక్రమాలపైనా చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com