AP New Cabinet: ఏపీ కొత్త కేబినెట్‌‌కు కౌంట్‌డౌన్ మొదలు.. ఏప్రిల్ 7న..

AP New Cabinet: ఏపీ కొత్త కేబినెట్‌‌కు కౌంట్‌డౌన్ మొదలు.. ఏప్రిల్ 7న..
AP New Cabinet: కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో 10 రోజుల్లో మంత్రులంతా మాజీలవబోతున్నారు.

AP New Cabinet: కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో 10 రోజుల్లో మంత్రులంతా మాజీలవబోతున్నారు. ఏ ప్రాతిపదికన అమాత్యుల్ని మారుస్తున్నారు.. సమర్థతా, సామాజిక సమీకరణాలా.. మరొక కారణం అమైనా ఉందా అనే చర్చకు ఛాన్సే లేదు..! CM జగన్‌ ముందే చెప్పినట్టు సగం టర్మ్‌ తర్వాత కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తున్నారు. ప్రస్తుతం తెలుస్తోన్న సమాచారం బట్టి చూస్తే.. కేబినెట్‌ 25 మందిలో నలుగురైదుగురు తప్ప మిగతా వాళ్లకు ఉధ్వాసన తప్పదు.

ఏప్రిల్‌ 7వ తేదీన ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. అదే ప్రస్తుత మంత్రులకు ఆఖరి సమావేశం అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ మీటింగ్‌లోనే మార్పులు, చేర్పులపై CM స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. అలాగే కేబినెట్ మీటింగ్ ముగిసిన మర్నాడే 8వ తేదీన గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ అడిగి బిశ్వబూషణ్‌ను కలిసి.. కేబినెట్లో మార్పుల్ని వివరిస్తారని సమాచారం.

వచ్చే నెల 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని కూడా తెలుస్తోంది. అందుకు సంబంధించి సమయం ఇవ్వాలంటూ గవర్నర్‌ను కోరనున్నారు. వచ్చే నెల 7న కేబినెట్ భేటీ కాకుండా అదే రోజు విస్తరణ ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతున్నా దానిపై స్పష్టత లేదు. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణతో పదవులు కోల్పోతున్న వారి పరిస్థితి ఏంటి..? ఇదే చర్చనీయాంశంగా మారింది.

కొందరు సీనియర్లను కొనసాగిస్తారని అంటున్నా.. దానిపైనా చాలా తర్జన భర్జనపడుతున్నారు. అటు, ఆలస్యంగా కేబినెట్‌లోకి వచ్చిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు లాంటి వారిని కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. 7న జరిగే సమావేశంలోనే మాజీలయ్యేవారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పడంపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం.

అసంతృప్తులు ఉన్నా సర్దుకుపోవాలంటూ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినా బొత్స, పెద్దిరెడ్డి, బాలినేని లాంటి వారి విషయంలో వారిని ఎలా బుజ్జగిస్తారనేదే ఆసక్తికరంగా మారింది. చిత్తూరు జిల్లా నుంచి సీనియర్‌గా ఉన్న పెద్దిరెడ్డిని తప్పిస్తే ఎవరికి ఛాన్స్‌ ఇస్తారు.. విజయనగరం జిల్లాలో బొత్సకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఆయన వారసులుగా ఎవరు కేబినెట్‌లోకి వస్తారు అనే దానిపై రకరకాల సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.

చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డిని తప్పిస్తే ఇక ఆ జిల్లా నుంచి ఎవరికీ చోటు ఉండదా.. అలాంటి కండిషన్‌ ఆయన్నుంచి వచ్చిందా.. అనేది కూడా చర్చనీయాంశమైంది. కొన్ని కుల సమీకరణాల్లో భాగంగా బాలినేనని తప్పించి, జిల్లాకే చెందిన మరో మంత్రిని కొనసాగిస్తారనే ప్రచారాలు మొదలైనా అలాంటి వాటిని వైసీపీ వర్గాలు కొట్టిపడేస్తున్నాయి.

ఏదెలా ఉన్నా త్వరలోనే కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందనేది కన్ఫాం కాబట్టి.. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో నిరాశానిస్ఫృహలు కనిపిస్తున్నాయి. ఇంకా పదవుల్లోనే ఉన్నా అధికారం అప్పుడే చేజారిన ఫీలింగ్‌లో కొందరు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నిజానికి కరోనా వల్ల చాలా శాఖల బాధ్యతలు చేపట్టిన మంత్రులకు పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం రాలేదు. పేరుకు పదవులు ఉన్నా తమదైన మార్క్ వేసే అవకాశమే దక్కలేదు. ఇంతలోనే ఇప్పుడు మాజీలుగా తప్పుకోవాల్సి రావడం అసంతృప్తికి కారణమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story