CBN: సోదరుడి మృతితో విషాదంలో చంద్రబాబు

సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో తమ్ముడి పార్థివ దేహానికి నివాళి అర్పించారు. సోదరుడి భౌతిక కాయాన్ని చూసి చలించిపోయారు. తనను విడిచి తన సోదరుడు వెళ్లిపోయాడని.. తమ నుంచి దూరమై మా కుటుంబంలో ఎంతో విషాదం నింపాడని వాపోయారు. పరిపూర్ణ మనసుతో తమ్ముడు రామ్మూర్తినాయుడు ప్రజలకు సేవ చేశారని చెప్పారు. సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. తమ్ముడి కుమారులు గిరీష్, రోహిత్‌లను ఓదార్చారు. రామ్మూర్తినాయుడు భౌతిక కాయాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తినాయుడు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు
ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు అయ్యింది. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఆయన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీలో అంగ్ల పత్రిక కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌కు రానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నేరుగా ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు.
ఓదార్చిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కుమారులైన రోహిత్, గిరీశ్‌లు కన్నీరు పెట్టుకున్నారు. వారిని సీఎం చంద్రబాబు అక్కున చేర్చుకుని ఓదార్చారు. తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ ఇద్దరు సోదరులకు పెదనాన్నగా ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ సోషల్ మీడియాలో పంచుకుంది.
చంద్రబాబును పరామర్శించిన రాహుల్ గాంధీ
సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి పరామర్శించారు. చంద్రబాబు కుటుంబానికి రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు. కాగా, నేడు నారావారిపల్లెలో రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com