AIIMS: నేడు ఎయిమ్స్‌కు సీతారాం ఏచూరి పార్థివదేహం

AIIMS: నేడు ఎయిమ్స్‌కు సీతారాం ఏచూరి పార్థివదేహం
X
నివాళులు అర్పించనున్న చంద్రబాబు, నడ్డా... జీర్ణించుకోలేకపోతున్నానన్న చంద్రబాబు

సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని ఇవాళ వసంత్ కుంజ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకురానున్నారు. పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు వచ్చి నివాళి అర్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడే మృతదేహాన్ని ఉంచుతారు. సాయంత్రం నాలుగు తర్వాత మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తారు. మరోవైపు చంద్రబాబునాయుడు ఏచూరిని నివాళులు అర్పించి భావో‌ద్వేగానికి గురయ్యారు.

గొప్ప నాయకుణ్ణి కోల్పోయాం

పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్లు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. అందుకే ఆయన్ను కడసారి చూసి, నివాళులు అర్పించేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు శుక్రవారమిక్కడ సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఏచూరి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. 40 ఏళ్లుగా ఆయన్ను దగ్గరి నుంచి చూశానని, మంచి నాయకుడని చెప్పారు. ఎన్నో పోరాటాల్లో ఆయనతో కలిసి నడిచినట్లు తెలిపారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన సీతారాం అసాధారణ వ్యక్తిగా ఎదిగారన్నారు. కమ్యూనిజం పట్ల ఆసక్తి పెంచుకుని, ఆ పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగి, పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారని కొనియాడారు. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ కలుపుగోలుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. దేశం గొప్ప రాజకీయ నాయకుడిని కోల్పోయినందుకు బాధగా ఉందని చెప్పారు. అంతకుముందు ఏచూరి మృతదేహన్ని ఎయిమ్స్‌ నుంచి జేఎన్‌యూకు తరలించారు. తర్వాత ఆయన స్వగృహానికి తరలించారు.

నివాళులు అర్పించిన నడ్డా

ఏచూరి నివాసానికి వెళ్లిన భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఏచూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నడ్డా మాట్లాడుతూ.. ‘‘మా ఇద్దరి సిద్ధాంతాలు వేరు. కానీ, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటూనే.. తనతో విబేధించిన వారితో సైతం సంబంధాలను కొనసాగించారని కొనియాడారు. పరస్పర విరుద్ధ ఆలోచనలను అంగీకరించిన ఏచూరి.. అదే ప్రజాస్వామ్యానికి అందమని తరచూ చెప్పేవారని నడ్డా గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఏచూరికి నివాళులర్పించిన వారిలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు ఉన్నారు.

Tags

Next Story