CBN: దావోస్‌కు ముందే రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు

విజన్ 2047 లక్ష్యంగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. కొత్త నినాదం ఇచ్చారు. "థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ" నినాదంతో ముందుకు వెళ్తామని చంద్రబాబు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ పైనే దావోస్ లో విస్తృత చర్చ జరిగిందన్న బాబు.. 1997 నుంచి తాను దావోస్ వెళ్తున్నట్లు గుర్తుచేశారు. దేశం నుంచి దావోస్ కు వెళ్లిన తొలి వ్యక్తిని తానేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దావోస్‌లోనే పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలు జరగాలని అనుకోవడం ఒక మిథ్య అని, దావోస్ సదస్సుకు ముందే రాష్ట్రానికి రూ.నాలుగు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయనిచంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో పెట్టుబడులపై జరిగిన చర్చలను చంద్రబాబు వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనరీని బీపీసీఎల్ రూ. 95 వేల కోట్ల పెట్టుబడితో రామాయపట్నంలో పెట్టబోతోందని... దీనికి సంబంధించిన ప్రాథమిక పరిశీలన, భూ సేకరణ కోసం ఆ కంపెనీ రూ.ఆరు వేల కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని చంద్రబాబు వెల్లడించారు.
అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ
ఆర్సెలార్- నిప్పన్ కంపెనీ అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రూ.లక్షా ముప్ఫై ఐదు వేల కోట్ల పెట్టుబడితో భారీ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే ప్రయత్నంలో ఉందని చంద్రబాబు వెల్లడించారు. ముడి ఖనిజం కేటాయింపుపై ఆ కంపెనీకి... కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వస్తే ఆ స్టీల్ ప్లాంట్ వస్తుందని చంద్రబాబు తెలిపారు. విశాఖ వద్ద పూడిమడకలో రూ.లక్షా ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు ప్రధాన మంత్రి శంకుస్ధాపన చేశారని తెలిపారు.
విశాఖకు గూగుల్
విశాఖ పట్నానికి గూగుల్ వస్తుందని చంద్రబాబు తెలిపారు. అది వస్తే విశాఖ దశ తిరుగుతుందన్నారు. అక్కడే టీసీఎస్ పది వేల మంది ఉద్యోగులతో డెవల్‌పమెంట్ సెంటర్ పెట్టబోతోందన్నారు. టాటా కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ ఇండియాను రాష్ట్రంలో ఒక విమానాశ్రయం నిర్మించాలని అడుగుతున్నామని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగంలోనే ఆంధ్రప్రదేశ్‌కు రూ. పది లక్షల కోట్ల మేర పెట్టుబడులు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఇక్కడే ఇన్ని ఎంవోయూలు జరిగిన తర్వాత దావోస్‌లో అవి జరగలేదనుకోవడం సరికాదన్నారు. అక్కడ జరిగే ఎంవోయూల్లో ఎన్ని నిజంగా వచ్చాయో ఎవరూ చూడరన్నారు. ఇక్కడ ఉండేవారితో అక్కడ ఎంవోయూలు చేసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని చంద్రబాబు తెలిపారు. దావోస్‌లో రాష్ట్రాల మధ్య పోటీ నెలకొనడం ఆరోగ్యకరమైన సంప్రదాయని చంద్రబాబు వెల్లడించారు. వామపక్షాలు పాలిస్తున్న కేరళ ప్రభుత్వ బృందం కూడా దావోస్ వచ్చి పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. పోటీ లేకపోతే ముందుకు వెళ్లలేమని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com