CBN: వారసత్వం ఓ మిథ్య: చంద్రబాబు

CBN: వారసత్వం ఓ మిథ్య: చంద్రబాబు
X
లోకేశ్ వారసత్వంపై స్పందించిన ముఖ్యమంత్రి... వైసీపీపై కక్ష సాధింపు చర్యలు ఉండబోవని స్పష్టీకరణ

భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యనటలో భాగంగా ఆయన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌, టీజీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘భారత్ నుంచి పలు పార్టీలు వచ్చినా దావోస్‌లో అందరం ఒక్కటే. గతంలో ఒకరిద్దరు సీఎంలు, కేంద్రమంత్రులు వచ్చేవారు. భారత్ ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏపీ సుస్థిరాభివృద్ధికి చాలా కష్టపడాలి’ అని బాబు అన్నారు. వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం.. ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అని చంద్రబాబు స్పష్టం చేశారు. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని... ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని చంద్రబాబు స్పష్టం చేశారు. తానెప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదన్న చంద్రబాబు... 33 ఏళ్ల క్రితం కుటుంబవ్యాపారం ప్రారంభించామని గుర్తు చేశారు.

లోకేశ్ ప్రజాసేవకోసమే..

లోకేశ్‌ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు తెలిపారు. అందులో సంతృప్తి పొందుతున్నారని... ఇందులో వారసత్వమంటూ ఏమీ లేదని చంద్రబాబు వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని... రాజకీయ కక్షసాధింపు చర్యలేవీ ఉండవన్నారు. ఎవరు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చట్టపరంగానే వ్యవహరిస్తామన్నారు.

రక్తంలోనే ఉంది..

భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సీఐఐ ఆధ్వర్యంలో గ్రీన్‌ ఇండస్ట్రియలైజేషన్‌పై నిర్వహించిన సదస్సులోనూ ఆయన పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. ఇక్కడ ఉన్న వారందర్నీ చూస్తుంటే తనలో నమ్మకం పెరిగిందన్న చంద్రబాబు... భవిష్యత్‌లో తన కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగిందన్నారు. రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని... భారత్‌లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశామని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. 25 ఏళ్ల కిందట బిల్‌గేట్స్‌ ఐటీ సేవలను తీసుకొచ్చారని.. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్‌, ఆర్థిక సంస్కరణలను వినియోగించి రెండో తరం సంస్కరణలను ప్రవేశపెట్టానని అన్నారు.

Tags

Next Story