CBN: జూన్ లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ

CBN: జూన్ లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ
X
టీడీపీలో పనిచేసిన వారికే పదవులు... సుదీర్ఘ కాలంగా ఉన్నవారిని ప్రోత్సహిస్తామన్న చంద్రబాబు

జూన్‌లోగా అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు,1,100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు చేపడతామన్నారు. కాగా పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న వారిని ప్రోత్సహించాలన్నారు. కష్టపడిన నేతలు, కార్యకర్తలకు న్యాయం చేసేలా పదవులు ఇస్తామని సీఎం తెలిపారు. టీడీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్‌లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు, కార్యకర్తల ఆశలు తీర్చేందుకు, ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.

వారికే పదవులు

పోస్టుల భర్తీకి ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని, ఆ పదవులు ఆశిస్తున్నవారు కచ్చితంగా పార్టీ విభాగాలైన క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్‌లలో సభ్యులై ఉండాలని స్పష్టం చేశారు. ఏ స్థాయి నాయకులైనా క్యూబ్స్‌లో ఉంటేనే పదవులు దక్కుతాయని చెప్పారు. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చిన వారికంటే ఎప్పటి నుంచో టీడీపీలో ఉండి పనిచేసినవారినే నేతలు ప్రోత్సహించాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనన్నారు.

వేగంగా కదులుతున్న ఫైలు

ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈసారి ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పదవులు భర్తీ చేయడం ప్రాధాన్యంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్‌లు, డైరెక్టర్ల పదవులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూటమి ఒప్పందం ప్రకారం టీడీపీకి 80 శాతం, జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం భాగస్వామ్యం కేటాయించేలా కసరత్తు జరుగుతోంది.

Tags

Next Story