CBN: ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించి తీరుతాం

CBN: ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించి తీరుతాం
X
పోరాడి భారతరత్న సాధిస్తామన్న చంద్రబాబు.. ఎన్టీఆర్ ఢిల్లీని గజగజలాడించారని గుర్తు చేసిన చంద్రబాబు

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ని గౌరవించడం కాదని.. దేశాన్ని గౌరవించుకోవడం.. జాతిని గౌరవించడమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చే వరకు కచ్చితంగా వదిలిపెట్టబోమని.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే వరకు పోరాడి సాధిస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ లా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదన్న చంద్రబాబు.. భవిష్యత్తులో ఎక్కడైనా జరుగుతుందనే నమ్మకం కూడా లేదన్నారు. దేశంలో మొట్టమొదటిసారి రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని ఏలిన నిజమైన యుగపురుషుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఆయనకు భారతరత్న ఇచ్చి తీరాల్సిందేనని... అప్పటి వరకు పోరాటం సాగిస్తామన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ సభ నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్‌పై రూపొందించిన ‘తారకరామం’ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్‌ సినీ ప్రస్థానం పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.

సినిమాలను నిష్ఠతో చేశారు

శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరస్వామి పాత్రలను పోషించాల్సి వచ్చినప్పుడు ఎన్టీఆర్ మాంసాహారం తీసుకునేవారు కాదని చంద్రబాబు అన్నారు. నేలపైనే నిద్రించేవారని గుర్తు చేశారు. తనను ఆదరించిన ప్రేక్షకుల కోసం ఆయన శేషజీవితాన్ని అంకితం చేశారని అన్నారు. తొమ్మిది నెలల పాటు చైతన్యరథంపై రాష్ట్రమంతా పర్యటించారని... చివరికి పిల్లల పెళ్లిళ్లకు కూడా వెళ్లకుండా ప్రజల మధ్యే ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆయన సీఎంగా పాలనకు కొత్త అర్థాన్ని ఇచ్చారన్నారు. రాజకీయంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించారన్ానరు. ఢిల్లీని గజగజలాడించి నేషనల్‌ ఫ్రంట్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. క్యాపిటలిజం, కమ్యూనిజం.. మీది ఏ ఇజం అన్న విలేకరుల ప్రశ్నకు మరో ఆలోచన లేకుండా హ్యూమనిజం అని సమాధానం ఇచ్చారన్నారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌ 2047 రూపొందించామని చంద్రబాబు తెలిపారు. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు.

తెలుగు వారంటే గుర్తుచ్చేది ఎన్టీఆర్

యుగ పురుషులను సమాజం ఎప్పటికీ మరవదని చంద్రబాబు అన్నారు. దీనికి ఎన్టీఆర్‌ నిదర్శనమన్నారు. ‘ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారంటే ఎన్టీఆర్‌ గుర్తుకొస్తారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తెలుగువారి ఆత్మగౌరవం, అచ్చ తెలుగుదనంగా మారారన్నారు. 1945లో మద్రాసుకు రైలు ఎక్కాక ఆయన జైత్రయాత్ర ఆగలేదని... సినీ పరిశ్రమలో ముందుగా జీతానికి ఉద్యోగంలో చేరి తర్వాత వెండితెరను ఏలారన్నారు.

Tags

Next Story