AP: పోలవరం 2027లోపు పూర్తి చేస్తాం: చంద్రబాబు

ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని 2027 నాటికల్లా పూర్తి చేస్తామని.. సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. నదుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చలు జరిపిన చంద్రబాబు... పోలవరం నుంచి బనకచర్ల వరకూ నీటిని తీసుకెళ్లే అంశంపైనా చర్చించినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్రం మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించామని చంద్రబాబు వెల్లడించారు. 2027లోపు ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. కృష్ణా జలాల్లో ఏపీ అధిక నీటిని వాడుకుంటుందనే ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన మేరకే వాడుకుంటున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ, ఏపీలో గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయన్నారు. సముద్రంలో కలిసే నీటినే అదనంగా వాడుకుంటున్నామని... ఏపీలో జల్‌జీవన్ మిషన్ అమలు గురించి కూడా చర్చించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకాన్ని సరిగా వినియోగించుకోలేదన్నారు. ఇంటింటికీ నల్లా ద్వారా నీరు ఇచ్చే పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. తాము కొత్తగా డీపీఆర్ రూపొందించి జల్‌జీవన్ మిషన్ నిధులు వినియోగించుకుంటామని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com