CBN: భారత్ పేరు మార్మోగుతోంది

ప్రపంచ దేశాలు భారత్ అభివృద్ధిని గమనిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యటనలోనూ దీన్ని గమనించానని చెప్పారు. గతంలో ఐటీపై, ఇప్పుడు ఏఐపై దృష్టి పెరిగిందని వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఏఐ సాంకేతికతలో భారత్ ముందుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మార్మోగుతోందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుంది. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఢిల్లీ పరువుపోయింది
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా సీఎం చంద్రబాబు అక్కడ ప్రచారం నిర్వహించారు. 'ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ప్రతి మహిళకు నెలకి రూ.2,500 ఆర్థిక సాయం ఇస్తుంది. హోలీ, దీపావళి పండుగల్లో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీతోపాటు నెలకు రూ.500కే అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటాం. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యా సౌకర్యం కల్పిస్తాం' అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కామ్‌తో ఢిల్లీ పరువుపోయిందని చంద్రబాబు అన్నారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు సరిగ్గా లేవు. ఇప్పుడు దేశానికి ప్రధాని మోదీ నాయకత్వం అవసరం. ఒకప్పుడు ప్రజలు ఢిల్లీకి వచ్చేవారు. కానీ, ఇప్పుడు రాజధానిని వీడుతున్నారు. ఢిల్లీ వాయు, రాజకీయ కాలుష్యంతో నిండిపోయింది. ఈ పదేళ్లలో రాజధాని అభివృద్ధి కుంటుపడింది’ అని పేర్కొన్నారు.
ఆప్‌ది దద్దమ్మ ప్రభుత్వం
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. అధికారిక పార్టీ ఆప్‌పై విమర్శలు గుప్పించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆప్ విఫలమైందన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఆప్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యమునా నది ప్రక్షాళన చేస్తామని 10 ఏళ్లుగా చెబుతున్నారు, కానీ నది ప్రక్షాళన జరగాలంటే అది మోదీకే సాధ్యమన్నారు చంద్రబాబు. డబుల్ ఇంజిన్ సర్కారును ఎంచుకోవాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com