AP: చంద్రబాబు-పవన్ కీలక చర్చలు

ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమావేశమై కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో వీరిద్దరి సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై సీఎం చంద్రబాబుతో పవన్ చర్చించినట్లు తెలిసింది. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటన విశేషాలను సైతం చంద్రబాబుతో పవన్ వివరించినట్లు సమాచారం. సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవుల అంశంపై కూడా ఈ ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు మృతి చెందిన నేపథ్యంలో పవన్ చంద్రబాబును పరామర్శించారు.
కాకినాడ పోర్టుపై చర్చ
బియ్యం స్మగ్లింగ్‌కు కాకినాడ పోర్టు ప్రధాన కేంద్రంగా మారిందని, ఇంత పెద్ద బియ్యం దందాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందని చంద్రబాబుకు పవన్ వివరించినట్లు సమాచారం. ఈ పోర్టులో పర్యటించే సమయంలో తనను అడ్డుకోవడం, ఇతర అనుభవాలను సైతం సీఎం వివరించినట్లు తెలుస్తోంది. కాకినాడ పోర్టులో కార్యకలాపాల పర్యవేక్షణకు ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించాల్సిన అవసరంపైనా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. బియ్యం విషయంలో ప్రభుత్వం సీరియస్ అవడంతో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. తాను స్వయంగా పోర్టుకు వెళితే ఎదురైన పరిణామాలపైన… భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా.. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా, పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ఏం చేయాలి అనే అంశంపైనా సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించినట్లు సమాచారం.
రాజ్యసభ ఎన్నికలపైనా
రాజ్యసభ బై ఎలక్షన్ల నేపథ్యంలో అభ్యర్ధుల అంశంపై కూడా ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ తరఫున బీదా మస్తాన్ రావు ఉండగా, జనసేన తరఫున ఎవరు అనే దానిపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఇదే అంశంపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడి.. తన అన్న నాగబాబుకు రూటు క్లియర్ చేశారని చర్చ జరుగుతోంది. అలాగే బీజేపీ ఆర్. కృష్ణయ్యకు చోటిస్తుందా.. లేక మరెవరినైనా ప్రతిపాదిస్తుందా అనే అంశం పైన కూడా.. చంద్రబాబు, పవన్ చర్చించినట్టు తెలుస్తోంది. అటు నామినేటెడ్ పదవుల అంశం పైన కూడా చర్చించినట్టు సమాచారం. సోషల్ మీడియా కేసులపైన కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే కేబినెట్‌లో పీడీఎస్ రైస్ అంశంపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం.
ఒకరోజు ముందే మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4న ఈ భేటీ జరగాల్సి ఉంది. తాజాగా మంగళవారమే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు పీడీఎస్ రైస్‌కు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయడంపైన వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని సెటైర్లు వేశారు. ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నం పై కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు పేర్ని నాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. కాకినాడ పోర్ట్‌లో పవన్ కళ్యాణ్ యాక్షన్.. గబ్బర్ సింగ్ 3 తలపించిందన్నారు. పీడీఎస్ రైస్ పక్కదారి పట్టడం.. ఎవరు చేసిన తప్పేనన్నారు. అధికారంలో మీరు ఉన్నారుగా ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com