CBN: శ్రీవారే నాతో చెప్పించారు

శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని వేంకటేశ్వర స్వామే తనతో చెప్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయన్నారు. రామతీర్థంలో రాములవారి విగ్రహం తల తొలిగిస్తే దిక్కులేదు.. కనీసం చర్యలు తీసుకోలేదన్నారు. ఇలా ఒక్కటని కాదని.. నాటి ప్రభుత్వం చెయ్యని తప్పులేదన్నారు.. నాటి ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్లతో ఆడుకుందని వెల్లడించారు. నెయ్యి కల్తీపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, ఈ తప్పు చేసినవారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతోందని, ఇంత పెద్ద అపచారం జరిగిన నేపథ్యంలో సంప్రోక్షణ గురించి జీయర్లు, కంచి పీఠాధిపతులు, ఇతర ధర్మాచార్యులు, పండితులతో మాట్లాడతామని వెల్లడించారు.
ప్రసాదాల నాణ్యత పరీక్షిస్తాం
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాముడి విగ్రహం తల తీసేసినా, ఆలయాలపై దాడి చేసినా పట్టించుకునే దిక్కు లేదని మండిపడ్డారు. జగన్ తప్పులు, పాపాలు చేసి.. మళ్లీ సిగ్గు లేకుండా బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు. ఏం చేసినా జరిగిపోతుందని జగన్ అనుకుంటే కుదరదని హెచ్చరించారు. ఏపీలోని అన్ని ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను పరీక్షిస్తామని, సంప్రోక్షణలు నిర్వహిస్తామని తెలిపారు. వైపీపీ పాలనలో ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, అమరావతి నాశనం చేసి.. వాటిపైనా ఎదురు దాడి చేసి తప్పుడు ప్రచారం చేశారు. బాబాయి హత్య విషయంలో ఎలా బుకాయించారో.. నేడు ప్రకాశం బ్యారేజ్ కు బోట్ల విషయంలో అలాగే మాట్లాడుతున్నారు. అందుకే వీళ్లను కొలంబియా నేరస్తుడు, మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చానన్నారు..
ప్రస్తుత పరిస్థితిలో భక్తుల మనోభావాల్ని కాపాడాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. దేవాలయం మీద గౌరవం పెంచాలని... భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలన్నారు. అదే తమ ముందున్న లక్ష్యమని.. ఇందుకోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆలోచిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గతంలో తిరుమల లడ్డూ ఇంట్లో ఉంటే ఇల్లంతా ఘుమఘుమలాడేదని... శ్రీవారి లడ్డూ తయారుచేయాలని ఎందరో ప్రయత్నించారని.. కానీ ఎవరి వల్లా కాలేదన్నారు. తిరుమల లడ్డూ, వడ, పొంగల్ ఇలా దేన్నీ రిప్లికేట్ చేయలేకపోయారని గుర్తు చేశారు. ఆ రుచి, అందుకోసం వాడే పదార్థాలు వేరన్నారు. ఇటీవల నేను అయోధ్య వెళ్లాను. అక్కడ వేంకటేశ్వరస్వామి దేవాలయం కట్టారు. వాళ్లు తిరుమల తరహా లడ్డూ ప్రసాదం తయారుచేయడానికి ఇక్కడి నుంచి మనుషుల్ని తీసుకెళ్లినా చేయలేకపోయారని అన్నారు. అంతటి విశిష్టత ఉన్న తిరుమల లడ్డూ నాణ్యతను గత ప్రభుత్వంలో దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com