CBN: పోలవరాన్ని గోదాట్లో కలిపేశారు

గత వైసీపీ ప్రభుత్వం.. అమరావతిని భ్రష్ఠు పట్టించిందని.. గత ఐదేళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేయడంతో పాటు పారిశ్రామికవేత్తలు ఏపీ వదిలి పారిపోయేలా చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అప్పట్లో చేపట్టిన జీఏడీ టవర్ల పిల్లర్లు... గత ఐదేళ్ల జగన్ పాలనలో నిర్లక్ష్యానికి గురై వర్షపు నీటిలో మునిగిపోయాయన్నారు. ఇన్నేళ్లుగా ఇవి నిండా నీటిలో నానిపోతూనే ఉన్నాయని... కొన్ని రోజులుగా భారీ మోటార్లతో ఈ నీటిని తోడే పనిని చేపట్టామని చంద్రబాబు తెలిపారు. గురువారం నాటికి నీరు దాదాపుగా తోడెయ్యగా జీఏడీ నిర్మాణాల పిల్లర్లు, పునాదులు ఇలా బయటకు కనిపించాయని ఫోటోలతో చూపించారు. ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వం గోదాట్లో కలిపేసిందని మండిపడ్డారు. స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంగా పనిచేస్తున్నామని.. ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేసి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తున్నామన్నారు. నేషనల్ పేమెంట్ గేట్‌వే ద్వారా ఎన్‌పీ ఖాతాలు తీసుకుంటున్నామని.. విపత్తు సమయాల్లో పరిహారం అందించడంలో తలెత్తే ఇబ్బందులను వీటితో అధిగమించవచ్చని చంద్రబాబు తెలిపారు.
సమాజం ఆనందంగా ఉండాలి
రాష్ట్రంలో ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. విజన్ డాక్యుమెంట్‌కు దేశంలో తొలిసారి 16లక్షల వ్యూస్ వచ్చాయన్న చంద్రబాబు... వికసిత్ భారత్ కూడా ఈ స్థాయిలో స్పందన రాలేదన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని 10 సూత్రాలతో మళ్లీ విజన్ రూపొందించామని చంద్రబాబు వెల్లడించారు. ఏపీ 15శాతం వృద్ధిరేటు సాధించగలిగితే 2025-26లో జీఎ్‌సడీపీ రూ.18.47 లక్షల కోట్లకు చేరుతుందని... ఇందులో 3.5శాతం అంటే రూ.64,646 కోట్లు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి అప్పు తెచ్చుకోవచ్చన్నారు. అప్పులు, ఆదాయం కలిపి రూ.1,84,703 కోట్లు అందుబాటులోకి వస్తాయని... వృద్ధిరేటు పెరగడం వల్ల అదనంగా రూ. 20,645కోట్ల ఆదాయం కలుస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
తలసరి ఆదాయంలో ఏపీ ముందంజ
పదేళ్ల నుంచి రాష్ట్రంలో నమోదవుతున్న తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,68,653 కాగా జాతీయ సగటు రూ.2,00,162గా ఉందన్నారు. ’ అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర జనాభా 2051 నాటికి 5.41 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు సీఎం చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com