CBN: పోలవరంతోనే క్షేత్రస్థాయి పర్యటన
ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించి వాటిని నిర్దిష్ట సమయంలో పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేకుండా పాలన ఉంటుందని తేల్చిచెప్పారు. పోలవరంతో తన క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని ప్రకటించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వస్తానని చెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుకు కార్యకర్తలు, నేతలు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తన కోసం వేచి చూస్తున్ కార్యకర్తలను చంద్రబాబు పలకరించారు.
ఇకపై ప్రతీ శనివారం పార్టీ కార్యాలయానికి వస్తానని చంద్రబాబు చెప్పారు. మంత్రులు సైతం తమ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు తరచూ వెళ్లాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వానికి-పార్టీకి మధ్య.. గ్యాప్ రాకుండా సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. పార్టీ కార్యాలయంలో బారికేడ్లు పెట్టిన పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రేణులను కలిసేటప్పుడు బారికేడ్లు పెట్టవద్దని.. ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి కొద్దిసేపు ఆలోచనలు పంచుకున్నారు. తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేకుండా పాలన ఉంటుందని తేల్చిచెప్పారు.
ప్రజల నుంచి వారి సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామన్నారు. దీనిని ఏ పద్దతిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందో అభిప్రాయాలు తీసుకుని ఉత్తమ విధానం అమలు చేస్తానన్నారు. సచివాలయంలోనే వినతులు స్వీకరణ ఎలా ఉండాలో..ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ప్రజా వినతుల స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తానని వాటి పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటానని.. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతరత్రా వెసులుబాటులన్నీ అందుబాటులోకి తెస్తానన్నారు. ప్రజావేదిక ఉండి ఉంటే వినతులు స్వీకరణ కు అనువుగా ఉండేది, కానీ జగన్ ప్రజా వేదికను కూల్చి వేశారని మండిపడ్డారు. ప్రజా వేదికను విధ్వంస పాలనకు ప్రతీకగా అలానే ఉంటుందని ఆ శిథిలాలు తొలగించబోమన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు పోలవరంతోనే ప్రారంభమవుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచీ నిర్వహించేది త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, మంత్రులు ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలతోచంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీకోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. 2014-2019 మధ్య ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామో...వాటన్నింటినీ వంద రోజుల్లోనే ఏర్పాటు చేస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నామన్నారు. మూడు పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారని చెప్పారు. అధికారం వచ్చిందని కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, విర్రవీగడం చేయవద్దని.... సీఎం సూచించారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే కృషి చేయాలని.... చంద్రబాబు కోరారు. ప్రజలతో మమేకమైతే ఇదే ఫలితాలు.. 2029లోనూ వస్తాయన్నారు. 2047 నాటికి మన దేశం ఉన్నత స్థాయిలో ఉండాలి అందులో తెలుగువారు నెంబర్ -1 గా ఉండాలి అనే లక్ష్యంతో కలసికట్టుగా కష్టపడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com