AP: పవన్‌కల్యాణ్‌కే అగ్ర తాంబూలం

AP: పవన్‌కల్యాణ్‌కే అగ్ర తాంబూలం
ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని ఒక్కడే... కీలకమైన శాఖలు పవన్‌కే

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి శాఖల కేటాయింపులో పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు పెద్దపీట వేశారు. 2014-19 మధ్య ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వగా... ఈసారి పవన్‌కల్యాణ్ ఒక్కరికే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు..పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ శాఖలు లోకేశ్‌ నిర్వహించారు. లోకేశ్‌ గతంలో నిర్వర్తించిన ఐటీశాఖతోపాటు విద్య, రియల్‌టైం గవర్నెన్స్‌ శాఖలు కేటాయించారు. ప్రతిపక్షంలో ఉండగా పో లీసుల నుంచి అనేక వేధింపులు ఎదుర్కొవడంతోపాటు, ఎస్సీ నేత అయి ఉండి కూడా అట్రాసిటీ కేసు ఎదుర్కొన్న వంగలపూడి అనితకు ఇప్పుడు అదే పోలీసులు సెల్యూట్‌ చేసేలా హోంశాఖను కేటాయించారు. మంత్రులతోపాటు, రాష్ట్ర ప్రజల ఉత్కంఠకు తెరదించుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులకు శాఖలను కేటాయించారు. సాధారణ పరిపాలనతో పాటు శాంతిభద్రతలు, ఇతర మంత్రులకు ఎవరికీ కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంచుకున్నారు.


సీనియర్‌ నేత అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్ధకశాఖ లను కేటాయించారు. కీలకమైన ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులతోపాటు శాసనసభ వ్యవహారాల బాధ్యతలను పయ్యావుల కేశవ్‌కు అప్పగించారు. కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్‌ శాఖలు కేటాయించారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కీలకమైన పౌరసరఫరాలు, ఆహార శాఖల బాధ్యతలు అప్పగించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్వర్తించిన మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖలను ఈసారి కూడా... పొంగూరు నారాయణకే కేటాయించారు. అమరావతి నిర్మాణంతోపాటు రాజధాని వ్యవహారంపై నారాయణకు పూర్తిస్థాయి పట్టు ఉన్నందున ఆయనకు అవే శాఖలను తిరిగి కట్టబెట్టారు. N.M.D ఫరూక్‌ కు న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖను అప్పగించారు. ఆనం రామనారాయణరెడ్డికి దేవదాయ శాఖను కేటాయించగా... అనగాని సత్యప్రసాద్‌ కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలిచ్చారు. గృహనిర్మాణం, సమాచార శాఖలను కొలుసు పార్థసారథికి అప్పగించారు.

కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారికి సైతం కీలక పదవులు వరించాయి. నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ధి శాఖ అప్పగించారు. పోలవరం పూర్తే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు... సర్కారు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అదే ప్రాంతానికి చెందిన రామానాయుడుకు ఈ బాధ్యతలు అప్పగించారు. భాజపా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సత్యకుమార్‌ యాదవ్‌కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖల బాధ్యతలు కేటాయించారు. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమంతోపాటు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవహారాలు అప్పగించారు. గొట్టిపాటి రవికుమార్‌కు విద్యుత్ శాఖ ఇవ్వగా చంద్రబాబు ఎంతో ఇష్టపడే పర్యాటక శాఖతోపాటు.. సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలను జనసేన నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కందుల దుర్గేష్‌కు కేటాయించారు. గుమ్మడి సంధ్యారాణికి మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం బాధ్యతలు అప్పగించారు. బీసీ జనార్ధన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖలను కేటాయించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలను టీజీ భరత్‌కు ఇవ్వగా... సవితకు B.C. సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలు కేటాయించారు.

Tags

Next Story