AP: దావోస్ పర్యటనకు చంద్రబాబు బృందం

AP: దావోస్ పర్యటనకు చంద్రబాబు బృందం
X
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం... "బ్రాండ్ ఏపీ" పునరుద్ధరించేందుకు చంద్రబాబు వ్యూహరచన

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌ పర్యటనకు వెళ్లింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ నుంచి చంద్రబాబు బృందం దావోస్‌కు వెళ్లింది. ఈనెల 20 నుంచి 5 రోజులపాటు జరిగే ప్రపంచదేశాల ఆర్థిక సదస్సులో చంద్రబాబు బృందం పాల్గొననుంది. మూడు సెషన్లలో సీఎం చంద్రబాబు, రెండు సెషన్లలో మంత్రి లోకేశ్‌ మాట్లాడనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఇప్పటికే ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. దావోస్‌లో తొలుత అక్కడ భారత రాయభారితో చంద్రబాబు బృందం భేటీ కానుంది. అనంతరం హిల్టన్‌ హోటల్‌లో 10 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి హోటల్‌ హయత్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో కలిసి సమావేశంలో పాల్గొంటారు. మీట్‌ అండ్‌ గ్రీట్‌ విత్‌ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహించే ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై, ఎపిని ప్రమోట్‌ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చిస్తారు. అక్కడ నుంచి దావోస్‌ చేరుకొని రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు.

బ్రాండ్ ఏపీనే నినాదం

ఐదేళ్లు దెబ్బతిన్న ‘బ్రాండ్‌ ఏపీ’ని అంతర్జాతీయ స్థాయిలో పునరుద్ధరించేందుకు దావోస్ సమావేశాలను చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఒకేచోట చేరే దావోస్‌ ఆర్థిక సదస్సును దీనికి వేదికగా మార్చుకోనుంది. ఏపీకి భారీ స్థాయిలో పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా మూడు రోజులు వరుస సమావేశాలు నిర్వహిస్తారు. ఒకే చోట పలువురు దేశాధినేతలతోపాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థల అధిపతులను కలిసే అవకాశం దావోస్‌లో లభిస్తుంది. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇదొక అద్భుత అవకాశంగా కూటమి ప్రభుత్వం భావిస్తోంది. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఒకేఒక్కసారి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. అయినా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెద్దగా పెట్టుబడులు రాలేదు. దీంతో... అంతర్జాతీయ యవనికపై ‘బ్రాండ్‌ ఏపీ’ గురించి ప్రచారం చేసే అవకాశమే లభించలేదు. ఇప్పుడు... చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాగానే దావోస్‌ ఆర్థిక సదస్సులో ఏపీ పెవిలియన్‌ కొలువు తీరుతోంది.

పొలిటికల్‌ గవర్నెన్స్‌కి కట్టుబడి ఉన్నాం: చంద్రబాబు

పొలిటికల్‌ గవర్నెన్స్‌కి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టే మా ప్రభుత్వం ఉంటుందని ఆయన తెలిపారు. 'తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టం. సోషల్ మీడీయాలో ఇష్టానుసారం పోస్ట్‌లు పెడుతూ విర్రవీగిన వాళ్లను నియంత్రించాం. గంజాయి, డ్రగ్స్, లిక్కర్‌ మాఫియాలను అణచివేస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. అసాంఘిక శక్తుల భరతం పడతాం’ అని ఆయన తెలిపారు.

Tags

Next Story