CBN: ప్రజలకు చంద్రబాబు తీపి కబురు

CBN: ప్రజలకు చంద్రబాబు తీపి కబురు
X
ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందించాలని నిర్ణయం.. ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదలకు శుభవార్త చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణంపై కీలక నిర్ణయాన్ని ప్రజలకు తెలిపారు. రాష్ట్ర గృహనిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 కేంద్ర ప్రభుత్వ పథకంతో అనుసంధానం చేసి ఇకపై కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందించాలని నిర్ణయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతం ఉండనుంది. కొత్త లబ్ధిదారుల ఎంపికపై వెంటనే సర్వే చేపట్టాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఎన్నికల హామీ మేరకు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అందిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఉన్న లేఅవుట్లలో కూడా వాటిని క్రమబద్ధీకరించి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి 2 సెంట్ల చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇళ్లు లేకుండా సొంత స్థలాలున్న వారికి కూడా అందులో గృహ నిర్మాణానికి అనుమతించనున్నారు. సచివాలయంలో గృహనిర్మాణంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారికి ప్రత్యేకంగా ఒక పథకాన్ని గృహనిర్మాణశాఖ ద్వారా అమలు చేయాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ వర్గాల వారికి కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వినియోగించి నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అర్హుల ఎంపికకు సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా....ఆయన వెంటనే అంగీకరించారు. ఈ పథకం కిందనే జర్నలిస్టులకు కూడా సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి అందిస్తుందని తెలిపారు.

2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరై... నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌ పెట్టినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ బిల్లులు దాదాపు రూ.950 కోట్లు ఉన్నట్టు తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు....ఆ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇళ్ల స్థలాలకు లబ్ధిదారుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న వివరాల ఆధారంగా మరో మారు తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.

Tags

Next Story