CBN: భూ బకాసురులపై ఉక్కుపాదం
జగన్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ప్రభుత్వ భూములను దోచుకున్నవారిపై కఠిన చర్యలకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. 22ఏ జాబితా నుంచి 4,21,433.97 ఎకరాలు డీ-నోటిఫై చేశారని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబే నివ్వెరపోయారు. దురాక్రమణ దారులతో అంటకాగిన రెవెన్యూ అధికారులను వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. చట్టాలను ఉల్లంఘించి దారుణాలు చేసిన వారిపై పకడ్బందీగా కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఉక్కుపాదం మోపండి..
ప్రభుత్వ భూములను దోచుకున్న ప్రైవేటు భూ బకాసురలను, వారికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. భూ దురాక్రమణదారులకు, ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాహాచేసిన వారికి రెవెన్యూ వ్యవస్థను దాసోహం చేసి.. అక్రమాల్లో కీలక భాగస్వాములుగా మారిన అధికారులపై పక్కా ఆధారాలతో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. అక్రమార్కులు ఎంతటివారైనా వదిలిపెట్టకూడదని, ప్రభుత్వ భూములను దోచిపెట్టినందుకు బాధ్యులైన వారు ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోకుండా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు పెట్టినట్లుగా ఉండకూడదని, ఫిర్యాదును చూడగానే ఆభియోగాలు ఎదుర్కొనే అధికారి ఎంతటి చట్టఉల్లంఘనలకు పాల్పడ్డారో తెలిసేలా స్పష్టమైన ఆధారాలు జతచేయాలని స్పష్టం చేశారు.
సీఎం సమీక్ష
సచివాలయంలో ప్రభుత్వ భూముల కబ్జాపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, స్పెషల్ సీఎస్ ఆర్.పి.సిసోడియా, సీసీఎల్‌ఏ జయలక్ష్మి, అదనపు సీసీఎల్‌ఏ ప్రభాకర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అసైన్డ్, చుక్కుల, షరతుగల పట్టా భూముల ఫ్రీ హోల్డ్‌పై సీఎం చర్చించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com