CBN: అమరావతి రైతులను కోటీశ్వరులు చేస్తాం

అమరావతిలో భూములు ఇచ్చిన వారికి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తున్నామని... దీనివల్ల భూములు ఇచ్చిన రైతులు కోటీశ్వరులు అవుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో ఇప్పటికే ఎన్నో విద్యా సంస్థలకు భూములు ఇచ్చామని... తాను చేపట్టిన ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించి ఏ రైతుకూ అన్యాయం చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు. అభివృద్ధిని సహించలేని కొందరు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. నెల్లూరు జిల్లాలో తరతరాలుగా వెనుకబడిన యానాది కుటుంబాలను అభివృద్ధి చేస్తాం. దేశంలో అసంఘటిత కార్మికులే అధికమని చంద్రబాబు అన్నారు.
వైసీపీ పాలనలో అన్ని కష్టాలే
ఆంధ్రప్రదశ్ లో గత ఐదేళ్లు అసంఘటిత కార్మికులు అనేక కష్టాలు పడ్డారన్న ఆయన... వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మేడే సందర్భంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 11 ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రారంభించారు. కార్మికుల కోసం కర్నూలు, గుంటూరులో వందపడకల ఆస్పత్రులు నిర్మిస్తున్నామన్న చంద్రబాబు... ఆంధ్ర యువతకు ఉపాధి కల్పించడానికి అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని... ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి కొంతభాగం వారికే తిరిగి ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. ఆ రైతులను కోటీశ్వరులుగా మారుస్తున్నామన్న ఆయన.. ఇప్పుడు రాజధానిలో భూముల విలువ పెరిగిందన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో 338 పరిశ్రమలు: చంద్రబాబు
నెల్లూరులోని ఆత్మకూరు పర్యటనలో భాగంగా CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘MSME పార్కుల్లో పరిశ్రమల స్థాపనకు సౌకర్యాలు కల్పిస్తాం. 173 ఎకరాల్లో ప్రారంభించిన MSME పార్కుల్లో 338 పరిశ్రమలు వస్తాయి. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తాం. అలాగే అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో రిజనల్ హబ్స్‌ను నిర్మిస్తాం’ అని చంద్రబాబు తెలిపారు. ‘యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. యువతకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇంటికొక పారిశ్రామిక వేత్త ఉండాలి. ఉపాధి కల్పన మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోంది. అమరాతిని ప్రపంచ స్థాయి నగరంగా తయారు చేస్తాం. అమరావతి సంపద సృష్టి. భూములిచ్చిన రైతులకు న్యాయం చేశాం’ అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com