AP: బీసీల అభివృద్ధిపై కూటమి సర్కార్ ప్రత్యేక దృష్టి

AP: బీసీల అభివృద్ధిపై కూటమి సర్కార్ ప్రత్యేక దృష్టి
X
స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం... ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ

ఏపీలో కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బీసీల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కులవృత్తులను బతికిస్తున్న వారికి టెక్నాలజీ తోడైతే వారి చేసే పని సులభతరం అవుతుందన్నారు. వెనకబడిన తరగతుల కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొత్త పనిముట్లు, పరికరాలను అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తప్పకుండా కల్పిస్తామని... చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటికే 34 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపామని గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్ల కోసం అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చంద్రబాబు తెలిపారు. రజకుల కోసం 2014-19 మధ్య నిర్మించిన ధోబీఘాట్లకు మరమ్మతు చేయాలని అధికారులకు సూచించారు.

మరికొందరు వైసీపీ నేతల అరెస్టు..!

వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, దుర్మార్గాలు, దాడులపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటనతో మరికొందరు వైసీపీ నేతల అరెస్టుకు రంగం సిద్ధం అవుతుందనే వాదన వినిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు, నేతలపై విచక్షణారహిత దాడులు జరిగాయి. ఈ దారుణాలపై విచారణను వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం ప్రకటించారు.

వైసీపీలో అసంతృప్తి రాగం

వైసీపీలో అసంతృప్తి గళాలు ఎక్కువయ్యాయి. పార్టీలో కొందరు నేతలు.. వ్యక్తిగతంగా మాట్లాడిన తీరే తమ ఓటమికి ప్రధాన కారణమైందని వైసీపీలో కొందరు నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి దీనిపై భగ్గుమన్నారు. ఇప్పుడు మరోనేత వాసుపల్లి గణేష్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని, వంశీ, రోజా లాంటి నేతల వల్లే ఓడిపోయామన్న భావన వైసీపీ నేతల్లో ఉందని ఈ వ్యాఖ్యల్లో అర్థమవుతోంది.

Tags

Next Story