CBN: ఏ తప్పు చేయకున్నా అరెస్ట్ చేశారు

ఎలాంటి కేసూ లేకున్నా, ఏ తప్పూ చేయకున్నా గత జగన్ ప్రభుత్వంలో తనను అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తప్పు చేయలేదన్న ధైర్యంతోనే బలంగా నిలబడ్డానని గుర్తు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో కూటమి గెలుస్తుందని నూటికి నూరు శాతం ముందే ఊహించానని తెలిపారు. ఓట్లు చీలిపోకూడదని జనసేన అధినేత పవన్ ముందుకు వచ్చారని, ఆ తర్వాత బీజేపీ కూడా కూటమిలో చేరిందని చెప్పారు. దేశ భవిష్యత్ కోసం ప్రధాని మోదీతో కలిసి పని చేస్తున్నామని వివరించారు. మోదీ హయాంలో భారతదేశం అగ్రరాజ్యంగా మారి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో చంద్రబాబు మాట్లాడారు.
ఆనాడే నిర్ణయించుకున్నాను..
1995లో తాను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యానని.. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఇంటర్నెట్ విప్లవం జరిగిందని... వీటిని ప్రజల కోసం ఉపయోగించాలనుకున్నాని అప్పట్లోనే నిర్ణయించుకున్నానని తెలిపారు. ప్రజలతో తన ఆలోచనలను పంచుకుని వేర్వేరు కార్యక్రమాలను చేపట్టానన్నారు. 1999లో కూడా విజయం సాధించానని.. అయితే ప్రజల ఆలోచనలను దాటి ముందుకు నడిచినందుకు రెండుసార్లు ఓడిపోయానన్నారు. దానివల్ల అభివృద్ధి ఆగిపోయిందని... నరేంద్ర మోదీ అలా కాదు. ప్రజలను తనతో పాటు వెంట తీసుకుని ముందుకు వెళుతున్నారని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు తనకు ఒక స్పష్టత వచ్చిందని... అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలను తనతో పాటు ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నానుని తెలిపారు.
కేంద్రంలో అప్పుడు మాదే కీలక పాత్ర
కేంద్రంలో తాము కీలక పాత్ర పోషించడం ఇదే తొలిసారి కాదని చంద్రబాబు గుర్తు చేశారు. వాజపేయి ప్రభుత్వానికి ఎలాంటి షరతులూ లేకుండా, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆరున్నరేళ్లు మద్దతు ఇచ్చామన్నారు. గతంలో పార్లమెంట్‌లో ప్రతిపక్ష పాత్ర పోషించామన్నారు. "ఆ సమయలో బీజేపీకి రెండు సీట్లే వస్తే టీడీపీకి 35 సీట్లు వచ్చాయి. వాజపేయి బీజేపీని నిర్మిస్తే మోదీ పటిష్ఠం చేసి సుస్థిరం చేశారు. ఒకప్పుడు 2 సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు పదకొండేళ్లుగా పరిపాలిస్తోంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది.” అని చంద్రబాబు అన్నారు. మహోన్నత దేశం కోసం తాము బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి అన్నారు. మోదీ బలమైన నాయకుడని... ఆయనది ఆధునిక ప్రగతి శీల దృక్పథమన్నారు. సంస్కరణలు, ఇంటర్నెట్ విప్లవం, టెక్నాలజీలను ఉపయోగించి తర్వాతి స్థాయి విప్లవాన్ని నరేంద్రమోదీ సృష్టించారు. ప్రపంచంలో 7.5-8 శాతం జీడీపీ వృద్ధి రేటు ఉన్న దేశం భారత్ మాత్రమే అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com