CBN: త్వరలోనామినేటెడ్ పదవుల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలను మర్చిపోలేమని అన్నారు. ప్రజా ప్రతినిధులు, టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు అంటున్నారన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి.. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని నేతలకు సూచించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించి ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని, దోషులను వదిలిపెట్టమని హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ..వ్యవస్థలను చక్కబెతున్నట్లు చంద్రబాబు చెప్పారు.
వైసీపీ దిగజారింది
ప్రజల సెంటిమెంట్‌తోనూ ఆడుకునే స్థాయికి వైసీపీ దిగజారిందని చంద్రబాబు అన్నారు. నేరం చేయడం, తప్పించుకోవడానికి ఎదురుదాడి చేయడం వారికి అలవాటుగా మారిందన్నారు. ఇలానే వదిలేస్తే అబద్ధాలను పదేపదే చెప్పి ప్రజలను మోసం చేస్తారని చంద్రబాబు అన్నారు. అధికారం చేపట్టగానే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టామని... తిరుమలలో గోవింద నామస్మరణే వినపడాలని చంద్రబాబు వెల్లడించారు. తిరుమలలో ఏ ఇతర నినాదాలు వినపడకూడదని ఇప్పటికే ఆదేశించామని చంద్రబాబు తెలిపారు. 2029 నాటికి టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తామని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని... పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యం. కార్యకర్తలకు ప్రమాద బీమాను రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచామని వెల్లడించారు.
లడ్డూ కల్తీపై సిట్
లడ్డు కల్తీ వ్యవహారంపై ఐజీ, ఆపై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలలో కల్తీ చేసి ఘోరమైన అపచారం చేశారని గత వైసీపీ పాలకులపై చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా అప్పుడే తన మీద దాడి జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పుడు సాక్షాత్తూ భగవంతుడే తనని కాపాడాడు అని అన్నారు. అందుకే ఏ పనిచేసినా వెంకటేశ్వరస్వామిని తలుచుకుంటానని చంద్రబాబు వెల్లడించారు. స్వామి వారికి అపచారం జరిగిందని.. వెంకటేశ్వరస్వామి అకౌంట్స్ సెటిల్ చేస్తాడని అన్నారు. వైఎస్సార్ హయాంలో 7 కొండలను 5 కొండలు అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించానని... ఆ తరువాత తాను పాదయాత్ర చేశానని చంద్రబాబు గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com