AP: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ సందడి

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పండుగ మొదలైంది. మరికొన్ని సంక్షేమ పథకాల అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేసింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పేద కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పథకం అమల్లో కొన్ని మార్పులు చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. ప్రస్తుతం లబ్ధిదారులు పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత.. ఆ మొత్తాన్ని రాయితీగా ప్రభుత్వం వారి ఖాతాలో వేస్తోంది. ఇకపై సిలిండర్ బుక్ చేసుకున్నారా.. లేదా.. అనేదానితో సంబంధం లేకుండా మూడు సిలిండర్లకు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం ముందుగానే జమ చేయనుంది. జనసేన, బీజేపీలతో చర్చించాక దీనిని అమల్లోకి తేనున్నారు. ఈ సమావేశంలో ముందుగా ఆపరేషన్ సింధూర్‌కు మద్దతు తెలుపుతూ మోదీకి అభినందనలు తెలిపారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి, ఆపరేషన్ సింధూర్‌లో వీరమరణం పొందిన సైనికులకు సంతాపం తెలిపారు.16,17,18 తేదీల్లో నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించాల్సిన మహానాడుపై ప్రధానంగా చర్చించారు. మండల పార్టీ అధ్యక్షులుగా మూడు దఫాలుగా ఆరు సంవత్సరాలపాటు పనిచేసినవారిని మార్చాలని నిర్ణయించారు. ఇకపై ‘మై టీడీపీ’ పేరుతో ఒకే యాప్‌ను అందుబాటులోకి తెస్తారు. ఇందులో అన్ని వివరాలు ఉంటాయి.**
12 అంశాలపై చర్చ..
పొలిట్‌బ్యూరో సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12న వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్తగా లక్షకు పైగా పింఛన్లు అందజేయనున్నారు. సూపర్-6, ఎన్నికల హామీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్‌ను త్వరలో ప్రకటించాలని నిర్ణయించారు. ప్రతి నెలా ఒక సంక్షేమ పథకం అమలు చేసేలా.. 12 నెలలకు క్యాలెండర్ ప్రకటిస్తారు. జూన్ 12న పాఠశాలలు తెరిచేలోగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఉపాధి హామీ, నీరు-చెట్టు కింద పనులు చేసిన కార్యకర్తలకు పెండింగ్ బిల్లుల్ని వెంటనే చెల్లించాలని నిర్ణయించారు. టీడీపీ శ్రేణులపై పెట్టిన 2,887 అక్రమ కేసుల్ని సమీక్షించి, వాటిని తొలగించేందుకు న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో యానాదులకు ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com