CBN: లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ : చంద్రబాబు

లడ్డు కల్తీ వ్యవహారంపై ఐజీ, ఆపై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలలో కల్తీ చేసి ఘోరమైన అపచారం చేశారని గత వైసీపీ పాలకులపై చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా అప్పుడే తన మీద దాడి జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పుడు సాక్షాత్తూ భగవంతుడే తనని కాపాడాడు అని అన్నారు. అందుకే ఏ పనిచేసినా వెంకటేశ్వరస్వామిని తలుచుకుంటానని చంద్రబాబు వెల్లడించారు. స్వామి వారికి అపచారం జరిగిందని.. వెంకటేశ్వరస్వామి అకౌంట్స్ సెటిల్ చేస్తాడని అన్నారు. వైఎస్సార్ హయాంలో 7 కొండలను 5 కొండలు అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించానని... ఆ తరువాత తాను పాదయాత్ర చేశానని చంద్రబాబు గుర్తు చేశారు.
కమిటీ వేస్తామన్న చంద్రబాబు
ఆలయ పరిపాలన, ఆగమ పండితులతో కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో ఆక్కడి సంప్రదాయాలను.. ఆగమాలను గౌరవించేలా కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. ఇకపై అన్య మతస్తులు ఆయా ప్రార్థన మందిరాల్లో ఉండకుండా చర్యలు చేపడతామన్నారు. హిందూ మతంలోనే కాదు.. అన్ని మతాల్లోనూ ఇదే విధానాన్ని అవలంభిస్తామన్నారు. అవసరమైతే చట్టం చేస్తామన్నారు. భగవంతునికి అపచారం జరగకుండా ఆపలేకపోయామని భగంవతునికి క్షమాపణ చెప్పాలన్నారు. అపచారం చేసిన వాళ్ల సంగతి భగంవతుడూ చూస్తాడన్నారు.
పవిత్రమైన క్షేత్రం తిరుమలలో గత ఐదేళ్లు రాజకీయాలకు పునరావాసంగా మారిందని చంద్రబాబు అన్నారు. భక్తుల మనోభావాలకు విలువ లేదన్నారు. ప్రసాదంలో, నాణ్యతలో ఎక్కడికక్కడా అపవిత్రం చేశారని మండిపడ్డారు. భక్తులు ఎన్నోసార్లు ఆందోళన చేశారని... ముఖ్యమంత్రిగా కాదు, ఓ భక్తుడిగా చెబుతున్నానని చంద్రబాబు తెలిపారు. వెంకటేశ్వరస్వామి లడ్డూకు ప్రత్యేకత ఉందని... 300 ఏళ్ల నుంచి భక్తులు పవిత్రంగా స్వీకరిస్తున్నారని వెల్లడించారు. తిరుమల శ్రీవారి వద్ద ఇష్టానుసారంగా ట్రస్ట్ బోర్డ్ నియామకం గ్యాంబ్లింగ్ గా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. తిరుమల కొండపై వ్యాపారం చేశారని.. స్వామివారి టికెట్లు ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సైతం పోరాటం చేశారని గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com