AP: తిరుపతి తొక్కిసలాట బాధ్యులపై వేటు

తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తిరుపతి SP సుబ్బారాయుడు, జాయింట్ కమిషనర్ గౌతమి ల పై బదిలీ వేటు వేసింది. DSP రమణ కుమార్ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి... చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ ను కూడ బదిలీ చేస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఈ ఘటన మొత్తంపై జుడిషియల్ విచారణకు ఆదేశించినట్లుగా తెలిపారు. జ్యూడిషియల్ ఎంక్వయిరీ పూర్తి అయిన తర్వాత మిగతా వారిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల సాయం
తొక్కిసలాటలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు ఆయా కుటుంబాల్లోని ఒకరికి ఒప్పంద ప్రాతిపదికన టీటీడీలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. వారి ఆరోగ్య స్థితి మెరుగుపడే వరకు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. స్వల్పంగా గాయపడ్డ 33 మంది బాధితులకు రూ.2 లక్షల చొప్పున పరిహారమిస్తున్నట్లు చెప్పారు. గాయపడ్డ 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయించి.. ప్రభుత్వ ఖర్చులతో వారి సొంతూళ్లకు చేరుస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏకంగా 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తూ వైసీపీ హయాంలో తీసుకొచ్చిన విధానంపై ఆగమ పండితుల సలహా మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
జుడిషియల్ విచారణకు ఆదేశం
తిరుమలలో ఉద్యోగులు సేవా భావంతో పనిచేయాలని చంద్రబాబు మరోసారి సూచించారు.. ఎవరూ పెత్తందారీలుగా వ్యవహారించకూడదన్నారు. గత ప్రభుత్వం వైకుంఠ ద్వార దర్శనాన్ని పదిరోజులకు పెంచిందని.. ఎవరి అభిప్రాయాలతో ఇలా చేశారో తెలియదన్నారు. టోకెన్ల జారీ కోసం ఎంపిక చేసిన ప్రదేశం సరైనది కాదని.. ప్రతి దాంట్లో తాను ఇన్వాల్వ్ కాను.. తాను ఎవరికి బాధ్యతలు అప్పగించానో వారు బాధ్యతతో పనిచేయాల్సి ఉందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని.. తిరుమల పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. తొక్కిసలాట ఘటనతో మనసు కలచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com