CBN: తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పుడూ అడ్డుపడలేదు

ఏపీ తీవ్ర ఆర్థిక, పరిపాలనా గందరగోళాన్ని ఎదుర్కొన్న సమయంలో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వృథా చేయకుండా, పాలనకు మళ్లీ దిశానిర్దేశం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల ఆశలను నిలబెట్టడమే కాకుండా, గతంలో దెబ్బతిన్న విశ్వాసాన్ని తిరిగి సంపాదించగలిగామని ఆయన అన్నారు. 2025 సంవత్సరం రాష్ట్రానికి మంచి ఫలితాలు తీసుకొచ్చిందని, సంక్షేమం–అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లగలిగామని తెలిపారు. సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. జీఎస్‌డీపీ వృద్ధి, ఆర్టీజీఎస్ వ్యవస్థ, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, భూసంబంధిత సంస్కరణలు వంటి కీలక అంశాలపై సీఎం సమీక్షించారు. గతంలో విధ్వంసానికి గురైన పరిపాలనా వ్యవస్థలను గాడిలో పెట్టడమే లక్ష్యంగా పనిచేశామని, ఆ దిశగా ఇప్పటికే స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.
గతంలో అమరావతిని శ్మశానం, ఎడారి అంటూ హేళన చేసిన వారు ఉన్నారని, కానీ ఇది రాష్ట్రానికి స్ఫూర్తినిచ్చే ప్రాజెక్టుగా మారబోతోందని చెప్పారు. అమరావతి నిర్మాణంలో రైతులను భాగస్వాములుగా చేసి అభివృద్ధిని ప్రజలతో కలిసి ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. ఇది కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాలకు హబ్‌గా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
పోలవరం ఓ అద్భుతం
పోలవరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని, అది పూర్తైతే దక్షిణ భారతంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడలేదని అన్నారు. పోలవరంలో మిగిలిన నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే రాష్ట్రానికి అపారమైన లాభం చేకూరుతుందని తెలిపారు. ఆ నీటిని నల్లమల సాగర్‌కు తీసుకెళ్లి ఉపయోగించడంలో తప్పేమీ లేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలోని అనేక ప్రాంతాలకు సాగునీటి లభ్యత పెరుగుతుందని చెప్పారు. అంతేకాదు, ఈ ప్రణాళిక వల్ల ఎవరికీ నష్టం లేదని, సహకార భావంతోనే ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

