CBN: ఈనెల 25న బాధితులకు వరద సాయం

CBN: ఈనెల 25న బాధితులకు వరద సాయం
సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం... బుధవారం రోజునే అకౌంట్లలో డబ్బులు జమ

వరద బాధితులకు పరిహారం చెల్లింపుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25న పరిహారం పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25వేలు, మొదటి, ఆపై అంతస్తు వారికి రూ. 10వేలు అకౌంట్లలో జమ చేయనున్నారు. పలు కారణాల వల్ల నష్టపోయిన వారికి కూడా బుధవారం రోజునే అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని సీఎం సూచించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు పరిహారం అందజేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై రివ్యూ చేశారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో ఈనెల 25వ తేదీన బాధితులకు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విజయవాడలో వరదకు మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తు వారికి రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

వ్యాపారులకు సాయం

చనిపోయిన పశువులకు, నష్టపోయిన వ్యాపారులకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పరిహారం అన్ని వర్గాల బాధితులకూ ఒకే సారి చెల్లించనుంది. ఇళ్లు మునిగిన వారితో పాటు వాహనాలు దెబ్బ తిన్న వారికి పంటలు దెబ్బ తిన్న రైతులకు నష్ట పరిహారం డబ్బులు బుధవారం అకౌంట్లలో నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది. పరిహారం విషయంలో తమ పేరు నమోదు కాలేదు అనే ఫిర్యాదు ఎక్కడా రాకూడదని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 10 వేల వాహనాలకు గాను ఇప్పటి వరకు 6 వేల వాహనాలకు బీమా సెటిల్మెంట్ పూర్తి అయిందని అధికారులు చెప్పారు. మిగిలిన వాహనాలకు కూడా బీమా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

సర్పంచుల చేయూత

విజయవాడ వరద బాధితులకు కైకలూరు మండల సర్పంచులు చేయూతనందించారు. కైకలూరు మండలంలోని 22 పంచాయితీల సర్పంచ్ లు తమ సొంత నిధులు రూ.1,35,000లను విరాళంగా ప్రకటించారు. మండల సర్పంచుల సంఘ అధ్యక్షుడు బలరామరాజు ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కి శుక్రవారం చెక్కు అందజేశారు. సర్పంచులు మేరీ నవరత్నకుమారి, తదితరులు పాల్గొన్నారు.


Tags

Next Story