AP: యురేనియం తవ్వకాలకు బ్రేక్

యురేనియం తవ్వకాలపై కూటమి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం లభ్యత, పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. యురేనియం తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం నియమించిన నిజనిర్ధారణ కమిటీ కూడా కీలక ప్రకటన చేసింది. యురేనియం తవ్వకాలు జరుగబోవని.. దీనిపై ఇప్పటికే చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దేవనకొండ ప్రజలు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. ఈ తవ్వకాలను వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సమీప గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించినట్లైంది.
వైసీపీ హయాంలోనే
2023 జూన్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే బోర్ల తవ్వకాల కోసం స్టేజ్-1 అనుమతులు మంజూరయ్యాయి. కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం ఉందా, లేదా అన్నది నిర్ధారించడానికి గత ప్రభుత్వ హయాంలోనే కొన్నిచోట్ల తవ్వకాలు జరిపారు. నమూనాలు పరీక్షించగా, యురేనియం నిక్షేపాలున్నట్లు తేలింది. మరింత లోతైన పరిశోధన కోసం అటవీ ప్రాంతంలోని 468.25 హెక్టార్లలో 68 బోర్ హోల్స్ వేసి మట్టి నమూనాలను తీసి విశ్లేషించాలని కేంద్ర ప్రభుత్వ ‘ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్’నిర్ణయించింది. వారి తదుపరి కార్యాచరణను ఏఎండీ ఇటీవల విడుదల చేసింది. దీనిపై స్థానికుల్లో నిరసన వ్యక్తమైంది.
అనుమతే లేదన్న మంత్రి
యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదని పరిశ్రమలశాఖ మంత్రి టిజి భరత్, కోడుమూరు ఎమ్మెల్యే బి దస్తగిరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగి యురేనియం తవ్వకాలపై స్పష్టత తీసుకున్నట్లు చెప్పారు. కప్పట్రాళ్లకు 150 కిలోమీటర్ల పరిధిలో యురేనియం తవ్వుతున్నట్లు, పరిసర ప్రాంతాల ప్రజలకు కేన్సర్ వస్తోందని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. యురేనియం తవ్వకాలు జరగవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే యురేనియం డ్రిల్లింగ్, తవ్వకాలకు అనుమతినిచ్చారని తెలిపారు. ఈ అంశంపై ప్రజలు ఆందోళన చెందొద్దన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com