AP: రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ రాజముద్ర, క్యూ ఆర్ కోడ్‌తో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను మాత్రమే భూ యజమానులకు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జగన్ ప్రచార పిచ్చితో తన బొమ్మ వేసుకోవడానికి రూ.15 కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. రీసర్వే పేరుతో రాళ్ల కోసం రూ.687 కోట్లు తగలేశారని.... మిగిలి ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలో ఆలోచించాలన్నారు. వాటిపై పేర్లు చెరిపేయాలంటే అదనంగా మరింత ఖర్చవుతుందని చంద్రబాబు తెలిపారు. చుక్కల భూముల విషయంలో అనేక అక్రమాలు జరిగాయన్న సీఎం... ఒక్క మెమోతో అక్రమాలకు ఊతమిచ్చారని అన్నారు. ఎసైన్డ్ భూముల విషయంలోనూ ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ పాలనలో కొనసాగిన భూ పందేరాల్లోని గుట్టు తేల్చాలని, భూదందాల వల్ల నష్టపోయిన బాధితులకు సత్వరం సాంత్వన చేకూర్చాలని చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో భూ సంబంధిత అంశాలే అతిపెద్ద సమస్యగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భూములు రేట్లు పెరుగుతున్నకొద్దీ వివాదాలు ఎక్కువవుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖను కూడా ప్రక్షాళించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారుల్లో భయాన్ని తీసుకురావడంతోపాటు వారు బాధ్యతగా విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. నేరాలు చేసిన వారిని శిక్షించడంతోపాటు భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూడటం ముఖ్యమని పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ భూ దందాలు జరిగాయని అన్నారు. వ్యవస్థలపై నమ్మకం రావాలంటే ప్రభుత్వపరంగా చర్యలు ఉండాలన్నారు. రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఉన్నతాధికారులతో సోమవారం సచివాలయంలో సమీక్షించారు.
భూముల సర్వే విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న విషయంలో మరింత చర్చ జరగాలని చంద్రబాబు వెల్లడించారు. ‘సర్వే వల్ల ప్రజలకు మంచి జరగాలి. క్షేత్రస్థాయిలో నిజంగా సర్వే జరిగిందా? రైతులు అంగీకారం తెలిపారా? సర్వే చేసిన అనంతరం సరిహద్దులు మారాయి. వాటిని ఎంతమంది అంగీకరించారనే డేటా ఉందా?’ అని సీఎం ప్రశ్నించారు. కొన్ని తప్పులు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. సమస్యలున్న భూములకు మాత్రమే సర్వే చేయాలని, అవసరం లేనిచోట సర్వే అక్కర్లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com