CBN: సాయంత్రంలోపు సాధారణ స్థితి నెలకొనాలి

CBN: సాయంత్రంలోపు సాధారణ స్థితి నెలకొనాలి
X
అధికారులకు చంద్రబాబు ఆదేశం... పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి..

విజయవాడ నగరంలో ఇవాళ సాయంత్రంలోపు సాధారణ స్థితి నెలకొనాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అనంతరం ఇతర పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టాలని సీఎం స్ఫష్టం చేశారు. కాగా నగరంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై వివరాలను అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ముంపునకు గురైన 32 వార్డుల్లో 26 చోట్ల సాధారణ స్థితి నెలకొంది. 3 షిఫ్టుల్లో పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేస్తున్నారన్నారు. మరోవైపు విజయవాడ వరద బాధితులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాను విజయవాడలో వరద బాధితులకు అండగా నిలిచి తన వంతు సహాయక చర్యలను అందిస్తున్నానని తెలిపారు. బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ, శానిటేషన్ నిర్వహణ, ప్రజా సమస్యలు తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు.

మరోవైపు శ్రీశైలం జలాశయం 5 గేట్లు ఎత్తి 1,37,620 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో జూరాల, సుంకేసుల జలాశయం నుంచి 2,46,379 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయ ప్రస్తుత నీటిమట్టం 883.80 అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 208.7210 టీఎంసీలుగా ఉంది.

జలాశయాలకు భారీగా వరద

అనకాపల్లి జిల్లా తాండవ జలాశయం ప్రమాదకరస్థాయికి చేరింది. అమ్మపేట, కొత్తమల్లంపేట గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. కోనాం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరింది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని తాటిపూడి జలాశయం నుంచి 350 క్యూసెక్కులు కిందకు వదలటంతో భీమిలి వద్ద లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మడ్డువలస జలాశయం 8 గేట్ల ద్వారా 17 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళంలోని వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో భారీగా వరద చేరుతోంది. విశాఖలోని మేఘాద్రి జలాశయం నీటిమట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

రాకపోకలకు అంతరాయం

సీలేరు-దుప్పిలవాడ మధ్యలో అంతర్రాష్ట్ర రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. 16 కి.మీ. రహదారిలో 12 చోట్ల రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే ప్రధాన మార్గంలో మడిగుంట, చింతలూరు, చింతపల్లి సమీపంలోని అంతర్ల, పెంటపాడు వద్ద భారీ వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా అప్రోచ్‌ రోడ్లు ఏర్పాటు చేశారు. మడిగుంట, పెంటపాడు వద్ద నిర్మించిన వంతెనలు కొట్టుకుపోయాయి.

Tags

Next Story