CBN: అనుచిత వ్యాఖ్యలు చేస్తే అదే ఆఖరి రోజు

CBN: అనుచిత వ్యాఖ్యలు చేస్తే అదే ఆఖరి రోజు
X
చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్... మహిళలకు గౌరవమివ్వాలని స్పష్టీకరణ

సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెడితే అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకల్లో చంద్రబాబు మాట్లాడారు. సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఎవరైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే వారికి చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. మహిళలను గౌరవప్రదంగా బతకనివ్వండి. మీకు చేతనైతే విలువలు నేర్పించండంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలోనే బూతులు

అసెంబ్లీలో బూతులు మాట్లాడేవారు.. తనను బూతులు తిట్టారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అది గౌరవసభ కాదు, కౌరవ సభ అని అప్పుడే చెప్పానని తెలిపారు. అసెంబ్లీలో సీఎంగా అడుగు పెడతానని చెప్పానని.. అలాగే అసెంబ్లీకి వచ్చానని గుర్తు చేశారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేసి గుండెపోటు అన్నారని.. తప్పులు చేసే వారిని ఉపేక్షించబోమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం వెళ్లి జగన్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంతకుముందు వైసీపీ హయాంలో తనను కూడా రాష్ట్రంలో తిరగనివ్వలేదని చెప్పారు. ఇప్పుడు స్వేచ్ఛగా తిరగనిస్తుంటే, రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. నేరాలు చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

టీడీపీ ఆగ్రహం

మరోవైపు మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై టీడీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. పార్టీ నుంచి కిరణ్‌ను సస్పెండ్‌ చేసింది. దీంతో చేబ్రోలు కిరణ్‌పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు మరోసారి హెచ్చరించారు.

Tags

Next Story