CBN: జాతీయ విపత్తుగా ప్రకటించండి

ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి…అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఏపీలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా, గతంలో వచ్చిన వరదల్లా చూడవద్దని కేంద్ర బృందాన్ని చంద్రబాబు కోరారు. రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయని.. కేంద్రం ఉదారంగా ఆదుకునే విధంగా చూడాలని కేంద్ర బృందాన్ని కోరారు. ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగిందని.. పంటలు నీళ్లలో మునిగి రైతులు కుదేలయ్యారని సీఎం అన్నారు. ప్రాణ, ఆస్థి నష్టంతో పాటు…తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక ప్రాణభయంతో తీవ్ర క్షోభను అనుభవించారని సీఎం చెప్పారు. ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేసేలా చూడమని కేంద్ర బృందాన్ని కోరారు.
వరద నష్టంపై చేపడుతోన్న ఎన్యూమరేషన్ గురించి సీఎంకు వివరించింది. ప్రాథమికంగా రూ.6,882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కేంద్ర బృందాలకు సీఎం వివరించారు. కృష్ణా బ్యారేజీ చరిత్రలో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదని.... గరిష్టంగా 11.90 లక్షల క్యూసెక్కుల వరదకు అనుగుణంగా ప్రకాశం బ్యారేజీని నిర్మించారని... మొన్న కురిసిన వర్షాలకు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని చంద్రబాబు వెల్లడించారు. కృష్ణా నదికి ఒక వేళ 14 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరదల్లో ప్రజలు పడిన బాధలు చూసి చలించిపోయామని.. మంత్రులు, అధికారులు అంతా క్షేత్ర స్థాయిలో ఉండి పనిచేశారని వివరించారు.
ప్రజలకు ధైర్యం ఇచ్చేందుకు విజయవాడలోనే ఉండి పనిచేశామని... కలెక్టర్ కార్యాలయాన్ని సచివాలయంలా చేసుకుని పనిచేశామన్నారు. సమస్త యంత్రాంగాన్ని రంగంలోకి దించి ప్రజలకు నమ్మకం కల్పించామని వెల్లడించారు. ముఖ్యమంత్రి నుంచి చిన్న ఉద్యోగి వరకు క్షేత్ర స్థాయిలో ఉండి వరద సహాయక చర్యలను యుద్దంలా చేపట్టామని వెల్లడించారు. పెద్ద ఎత్తున పంటనష్టం జరిగిందని... నష్టపోయిన కౌలురైతులకు సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లు, ఇరిగేషన్ వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందని,,. సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న వరద బాధితులకు, రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప తిరిగి కోలుకోలేరన్నారు. అందుకే సాధారణ విపత్తులా దీన్ని చూడవద్దు అని కోరుతున్నామని సీఎం కేంద్ర బృందానికి వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com