CBN: మిర్చి రైతులను ఆదుకుంటాం: చంద్రబాబు

CBN: మిర్చి రైతులను ఆదుకుంటాం: చంద్రబాబు
X
రైతులు ఆందోళన పడొద్దన్న చంద్రబాబు... కేంద్ర వ్యవసాయమంత్రితో కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి ధరలు పడిపోయాయని అన్నారు. ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్‌ తగ్గడం వల్ల మిర్చి రైతులు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు. రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందు కీలక ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు. రైతులకు న్యాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు.

ఎందుకు తగ్గాయో ఆలోచించాలి

మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో ఆలోచించాల్సిన అవసరముందని చంద్రబాబు అన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాలి.. వారికి మేలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తెచ్చామని తెలిపారు. మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద 25 శాతం మాత్రమే ఇస్తారని... అది కూడా ఐసీఏఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఏపీలోని కాస్ట్‌ ఆఫ్‌ కల్టివేషన్‌ తీసుకోకుండా.. ధర నిర్ణయించే పరిస్థితికొచ్చారని వెల్లడించారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో ఆలోచిస్తామని చంద్రబాబు తెలిపారు.

పోలవరం అప్పటికల్లా పూర్తి చేస్తాం

ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని 2027 నాటికల్లా పూర్తి చేస్తామని.. సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. నదుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చలు జరిపిన చంద్రబాబు... పోలవరం నుంచి బనకచర్ల వరకూ నీటిని తీసుకెళ్లే అంశంపైనా చర్చించినట్లు వెల్లడించారు.

Tags

Next Story