AP: ప్రపంచబ్యాంక్ బృందంతో చంద్రబాబు కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు... ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. రాజధాని అమరావతి నిర్మాణంపై వరల్డ్ బ్యాంకు ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు. రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తోన్న నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో సమావేశమై అమరావతి గురించి చర్చించింది. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వారికి వివరించారు. వరల్డ్ బ్యాంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలీవియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్ షెన్, సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలిరజాక్ ఎఫ్.ఖలీల్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వారితో పాటు మంత్రి పొంగూరు నారాయణ, మంత్రి టీజీ భరత్, సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కమిషనర్ సీహెచ్.శ్రీధర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్ పాల్గొన్నారు.
చంద్రబాబు ఆరా
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ స్కూల్ బస్‌ల ఫిట్‌నెస్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అన్నమయ్య జిల్లాలో స్కూల్ వ్యాను బోల్తాపడి చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ అధికారులు డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని నిర్దేశించారు. ఫిట్ నెస్ లేని బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సదరం సర్టిఫికెట్లు నకిలీలపై ఆగ్రహం
నకిలీ సదరం సర్టిఫికెట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంగవైకల్యం ఉన్నవారికి వివిధ రూపాల్లో పింఛన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నకిలీ సదరం ధ్రువపత్రాల జారీపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాంటి ధ్రువపత్రాలపై పూర్తి సమాచారం సేకరించాలని.. పంచాయతీ రాజ్ శాఖ సమన్వయంతో నకిలీ పత్రాలు కట్టడి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానంలో ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఆస్పత్రికి ప్రభుత్వమే స్థలం ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ, పీపీపీ ఆస్పత్రులను ఒకే గొడుగు కిందకు తెస్తామన్నారు. ప్రభుత్వం తరఫున యాప్ రూపొందించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని.. టెలి మెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలందించాలని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్టుపట్టించడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com