CBN: టీటీడీ ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మనవడు నారా దేవాన్ష్ జన్మదినం సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అర్చకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. తరిగొండ వెంకమాంబ అన్నవితరణ కేంద్రంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు.. ప్రసాదాలు వడ్డించారు, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'టీటీడీ ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వం. ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు. టీటీడీ బోర్డు, అధికారులు తిరుమల పవిత్రను కాపాడాలి. తిరుమలలో అన్యమతస్థులు పనిచేయకుండా చర్యలు తీసుకోవాలి. తిరుమలలో ప్రైవేట్ సంస్థలు ప్రవేశించడానికి వీల్లేదు.' అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
భక్తులకు స్వయంగా వడ్డించిన చంద్రబాబు
తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈరోజు తన మనవడు దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా.. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. సీఎం చంద్రబాబు, దేవాన్ష్ భక్తులకు స్వయంగా వడ్డించారు.
ఆ తృప్తి వెలకట్టలేనిది
భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిదని చంద్రబాబు అన్నారు. సమాజ హితం కోసం అందరూ పనిచేయాలన్నారు. ఏడు కొండలు.. వేంకటేశ్వరస్వామి సొంతమని... ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదని చంద్రబాబు అన్నారు. తాను ఎప్పుడూ ప్రజాహితం కోసం పనిచేస్తానని.. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. ఏడుకొండలను ఆనుకొని ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదని చంద్రబాబు తేల్చి చెప్పారు. వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com