CBN: ఏపీ భవిష్యత్తును మార్చే ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక తెస్తున్నామని తెలిపారు. పది పాయింట్ల ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెట్రో రైల్, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై విశాఖ కలెక్టరేట్‌లో చంద్రాబాబు సమీక్ష నిర్వహించారు. జీరో పావర్టీ దిశగా వేగంగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఉద్యోగాల సృష్టి, కల్పన, నైపుణ్యాల పెరుగుదల, రైతు సాధికారత, ఆదాయం పెంపులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ కావాలన్నారు. ప్రపంచస్థాయి మౌలికవసతుల అభివృద్ధిలో దూసుకెళ్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు. స్వచ్ఛ ఏపీ దిశగా వేగంగా అడుగులు వేయాలని అధికారులకు చెప్పారు. అన్ని రకాల సాంకేతికత, పరిశోధనలో మనమే నంబర్ కావాలన్నారు. పీ-4 విధానంలో సంపద సృష్టిద్దామని.. ఇందుకోసం డబ్బుకంటే మంచి ఆలోచనే ముఖ్యమని చంద్రబాబు అన్నారు.
ఆడబిడ్డల జోలికొస్తే...
తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న పిల్లలను కూడా వదలకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. అసలు వీళ్లు మనుషులేనా? అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండాలంటే.. నడిరోడ్డుమీద ఒకరిద్దరిని ఉరితీస్తేనే అడ్డుకోగలమని సీరియస్ కామెంట్స్ చేశారు. గంజాయి, మద్యం వల్లే ఏపీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే హెచ్చరించాం. మరోసారి ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆడపిల్ల అంటే విలాస వస్తువు కాదని అన్నారు.
సంక్రాంతి లోపు గుంత కనపడొద్దు
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ నాటికి రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దని.. అన్ని గుంతలు పూడ్చాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రా ఎస్కోబార్ వచ్చి రోడ్లపై గుంతలు పెట్టి వెళ్లారని మాజీ సీఎం జగన్ను విమర్శించారు. రోడ్లు అనేవి నాగరికతకు చిహ్నమని.. రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయని చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలంలో రహదారిపై ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు. ‘‘ఏపీలోని రోడ్లు నరకానికి రహదారిగా మారాయి. రహదారులు ఈ దుస్థితికి రావడానికి గత పాలకులే కారణం. గత సీఎం రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారు. రహదారులు అభివృద్ధికి చిహ్నం. గుంతలు లేని రోడ్లకు వెన్నలపాలెంలో శంకుస్థాపన చేశాం. రహదారులు బాగుంటే వ్యాపారాలు బాగా జరుగుతాయి. సంక్రాంతిలోపు రోడ్లపై ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చాలి.’’ అని అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com