Chandrababu Naidu: అవి తలుచుకుంటే హృదయం తరుక్కుపోతోంది

Chandrababu Naidu: అవి తలుచుకుంటే హృదయం తరుక్కుపోతోంది
X
రాజమహేంద్రవరం జైల్లో సందేహాస్పద ఘటనలు.. ఆహా ‘అన్‌స్టాపబుల్‌’ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ నాలుగో సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై కీలక అంశాలపై స్పందించారు. ఈ ఎపిసోడ్ ఓటీటీ ‘ఆహాలో శుక్రవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా బావమరిది, బావ మధ్య సాగిన ప్రశ్నోత్తరాలు ఆసక్తికరంగా సాగింది. గతంలోనూ తాను అన్ స్టాపబుల్ టాక్ షోకి వచ్చానని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నానని చంద్రబాబు వెల్లడించారు. ఆ తర్వాత ప్రజలు గెలవాలన్న లక్ష్యంగా కృషి చేసి విజయం అందుకున్నామని, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మరోసారి అన్ స్టాపబుల్ షోకి వచ్చానని వివరించారు. మీరు అన్ స్టాపబుల్... మేం రాజకీయాల్లో అన్ స్టాపబుల్ అని చంద్రబాబు చమత్కరించారు. ఇక, తాను మొదటిసారిగా జైలులో అడుగుపెట్టిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. నాడు నంద్యాలలో నోటీసులు లేకుండా అరెస్ట్ వారెంట్ ఇచ్చారని, గట్టిగా అడిగితే, తర్వాత నోటీసులు ఇస్తామని చెప్పారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.


సరదా సంభాషణలు

బాలయ్య, బాబు గారి మధ్య సరదా సంభాషణలు సాగాయి. ద్వాపరయుగంలో బావమరిది భవద్గీత చెబితే.. బావ విన్నాడు. ఇక్కడ బావ చెబితే.. బావమరిది వింటున్నాడని బాలయ్య అన్నారు. ‘అన్‌స్టాపబుల్‌’ పుస్తకంపై చంద్రబాబుతో సరదాగా ప్రమాణం చేయించారు బాలయ్య. ‘మీ చమత్కారం మీది.. మా సమయస్ఫూర్తి మాది’ చంద్రబాబు డైలాగ్ కొట్టారు. ఆతర్వాత షోలో చంద్రబాబును బాలయ్య తన ఫ్యామిలీ గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. మా చెల్లాయి మీకు ఒక రూ.500 ఇచ్చి కూరగాయలు తెమ్మంటే ఏం తెస్తారు అని బాలయ్య అడగ్గా ఆ డబ్బులను భద్రంగా దాచుకుంటా అని చంద్రబాబు నవ్వులు పూయించారు . అలాగే మీ లైఫ్ లో షుగర్ ఎవరు అని బాలకృష్ణ అడగ్గా మీ లైఫ్ లో చాలా షుగర్స్ ఉంటాయి.. నాకు ఒక్కటే షుగర్ అని సరదాగా అన్నారు.

జైలు జీవితంపైనా

నంద్యాలలో తనను అరెస్ట్ చేయడం నుంచి రాజమండ్రి జైలుకు తీసుకెళ్లే వరకు మధ్యలో ఎన్నో జరిగాయని చంద్రబాబు తెలిపారు. దర్యాప్తు అంటూ రాత్రంతా తిప్పారని... వేకువజామున వైద్య పరీక్షలకు పంపించారని... విపరీతంగా తిప్పి కోర్టుకు తీసుకెళ్లారన్నారు.. కోర్టులో సాయంత్రం వరకు వాదనలు జరిగాయని.... చివరికి అర్ధరాత్రి వేళకు జైలుకు తరలించారన్నారు. ఇవన్నీ తలచుకుంటే హృదయం తరుక్కుపోతోందని.. తన జైలు జీవితం గురించి ఎవరైనా ఓ పుస్తకం రాయొచ్చన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ వచ్చారని... ఆయనతో నేను మాట్లాడింది రెండే నిమిషాలు... పొత్తుపై నేనే ప్రతిపాదన చేశానన్నారు. అయితే ఆలోచించి నిర్ణయం తీసుకోమని పవన్ ను కోరానని.... కానీ ఆయన జైలు నుంచి బయటికొచ్చిన వెంటనే పొత్తు ఉంటుందని ప్రకటించారని తెలిపారు. బీజేపీని కూడా ఒప్పిస్తామని చెప్పారు... కూటమి విజయానికి పునాది అక్కడే పడిందన్నారు.

Tags

Next Story