AP: ప్రజా సమస్యల పరిష్కారానికి "జన నాయకుడు"

AP: ప్రజా సమస్యల పరిష్కారానికి జన నాయకుడు
X
కుప్పంలో ప్రారంభించిన చంద్రబాబు... సుపరిపాలను మంచి వేదిక అవుతుందన్న ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘జన నాయకుడు’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఎవరైనా నేరుగా వచ్చి సమస్యలు చెప్పినా, వాట్సప్‌లో విన్నవించినా.. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్రజాసమస్యలు తమ దృష్టికి తెచ్చినా వాటన్నింటినీ ఆ పోర్టల్‌లో నమోదు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆ సమస్యలను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ఆర్టీజీఎస్‌తో అనుసంధానించి.. నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సుపరిపాలనకు ఇది మంచి వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న కార్యకర్తలు.. ఈ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలు పరిష్కారమైతే అలాగే ఇల్లిల్లూ తిరిగి చెబుతారని చంద్రబాబు తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని.. సత్ఫలితాలు వస్తే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తానని పేర్కొన్నారు.

నేరుగా ముఖ్యమంత్రి చూసేలా..

ప్రతి అర్జీ, పరిష్కారం ఎంత వరకు వచ్చిందనేది నేరుగా సీఎం చూసేలా జన నాయకుడు పోర్టల్ లో డాష్ బోర్డ్‌ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి సమస్యలు సత్వరం పరిష్కారం అవుతున్నాయా...లేదా అన్నదాన్ని సీఎం ప్రత్యక్షంగా చూడొచ్చు. నేరుగా జన నాయకుడు కేంద్రానికి రాలేని వాళ్ల సౌకర్యార్ధం టోల్ ఫ్రీ నంబర్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. జన నాయకుడు పోర్టల్ లో నమోదైన సమస్యల పరిష్కారంపై కాల్ సెంటర్ నుంచి అర్జీదారులకు ఫోన్ చేసి వారి అభిప్రాయం కూడా తీసుకుంటారు. సంతృప్తిగా ఉన్నారా...అసంతృప్తిగా ఉన్నారా...అసంతృప్తిగా ఉంటే దానికి గల కారణాలను తెలుసుకుంటారు. మీడియాలో వచ్చే ప్రజాసమస్యలను కూడా గుర్తించి సూమోటోగా జననాయకుడు పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

అధికారుల తీరు సరికాదన్న సీఎం

అర్జీదారుల సమస్యలు సకాలంలో తీర్చాలని ఆదేశిస్తే.. కొందరు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇది సరికాదని చంద్రబాబు హితవుపలికారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని హెచ్చరించారు. తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతోమంది కార్యకర్తలు కష్టపడి పనిచేశారని... వారి ఆకాంక్షలను, ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలనూ తీర్చాలని చంద్రబాబు అన్నారు. పార్టీ కార్యకర్త తప్పు చేసినా, అధికారులు తప్పు చేసినా అంతిమంగా తనకే చెడ్డపేరు వస్తుందన్నారు. ఇది పొలిటికల్‌ గవర్నెన్స్‌ అని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీని తాను మర్చిపోతే మరోసారి ముఖ్యమంత్రిగా ఉండలేను కదా అని అన్నారు. తెలుగుదేశం చరిత్రలో తొలిసారిగా కోటి సభ్యత్వాల రికార్డును అధిగమిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. జనవరిలో సంస్థాగత ఎన్నికల క్రతువు మొదలుపెట్టి మే చివరికి ముగిస్తామన్నారు. టీడీపీ శ్రేణులకు రాజకీయ సాధికారత కల్పిస్తామని చంద్రబాబు హామీనిచ్చారు.

Tags

Next Story