CBN: జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి

CBN: జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి
X
ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం... అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రారంభం

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలన్నదే తమ లక్ష్యమని... దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని...ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ ఆలయాల సదస్సు 2025లో చంద్రబాబు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ హిందువులు అధికంగా ఉన్న విశ్వ నగరాల్లో శ్రీవారికి మందిరాలు నిర్మిస్తామని చంద్రబాబు అన్నారు. ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న సమయంలనే తిరుపతిలో ఆలయాల మహాకుంభ్‌ ప్రారంభమవుతుండడం సంతోషంగా ఉందన్నారు. మూడు రోజుల పాటు అంతర్జాతీయ ఆలయాల సదస్సు 2025 జరగనుంది. ఈ సదస్సుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్‌ హాజరయ్యారు. దేశానికి సరైన సమయంలో మోదీ వంటి నాయకుడు లభించాడని, వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు.

దేవాలయాలు.. అభివృద్ధి సూచికలు

మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది ప్రధాన పాత్ర అని చంద్రబాబు అన్నారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని... అభివృద్ధికి సూచికలని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో ఆలయ పర్యాటకానికి ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్న ఏపీ సీఎం... దేశంలో ఆలయాల ఎకానమీ విలువ రూ.6 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఆలయాల్లో ఏఐ సాంకేతికత ఇంకా పెరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తామని.. ముఖ్యంగా వైదిక, ఆగమ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని సీఎం స్పష్టం చేశారు. గుళ్ల రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని.. ఇటీవలే దేవదాయ శాఖ చట్టాన్ని సవరించామని తెలిపారు. అర్చకుల పారితోషికాలు పెంచామని గుర్తు చేశారు. ఐటీసీఎక్స్‌-2025 ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన ఆలయాల ట్రస్టులను ఏకం చేస్తోందన్నారు. తిరుపతిని జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

ముఖ్యమంత్రులు ఏమన్నారంటే.. ?

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ మాట్లాడుతూ హిందూ సంస్కతి సాంప్రదాయాలను కాపాడడానికి స్వాతంత్య్రానికి మునుపే చత్రపతి శివాజీ మహారాజ్‌ వీరోచిత పోరాటాలను చేశారన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ మాట్లాడుతూ టెంపుల్‌ కన్వెన్షన్‌ ద్వారా ఆధ్యాత్మికతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విస్తత మార్గాలు ఏర్పడతాయన్నారు. ఐటిసిఎక్స్‌ కార్యక్రమం మరో రెండు రోజులు జరగనుంది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌ పో వ్యవస్థాపకులు గిరీష్‌ వాసుదేవ్‌ కులకర్ణి, చైర్మన్‌ ప్రసాద్‌ లాడ్‌, కేంద్రమంత్రి పట్నాయక్‌, మహారాష్ట్ర మంత్రులు సురేష్‌, విశ్వజిత్‌, గోవా మంత్రి రోహన్‌, ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు పాల్గొన్నారు.

Tags

Next Story