AP: అమిత్ షాతో ఎన్టీఏ నేతల కీలక భేటీ

AP: అమిత్ షాతో ఎన్టీఏ నేతల కీలక భేటీ
X
ఎన్టీఆర్‌కు భారత రత్న ఇచ్చే అంశంపైనా చర్చ... జగన్‌ ప్యాలెస్‌లపై ఆరా తీసిన అమిత్ షా

అమరావతి వేదికగా కేంద్రహోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో ఎన్డీఏ నేతల కీలక భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అమిత్‌షా డిన్నర్ మీటింగ్ గంటన్నర సేపు కొనసాగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్‌ పురంధేశ్వరి సహా పలువురు మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై అమిత్‌ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ రైజింగ్‌ డే వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఏపీకి వచ్చిన అమిత్‌షాకి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు లోకేశ్‌, అనిత, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఘన స్వాగతం తెలిపారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న అమిత్ షాకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఘనస్వాగతం పలికారు. అక్కడ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో కలిసి గంటన్నరపాటు డిన్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఎన్టీఆర్ భారత రత్నపై షా కీలక వ్యాఖ్యలు

ఏపీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర హోం మంత్రితో.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చర్చించినట్టు తెలిసింది. ఎన్టీఆర్‌కు భారతరత్న పెండింగ్‌లో ఉందని పురందేశ్వరి కేంద్రమంత్రికి చెప్పారు. అనంతరం అమిత్‌ షా, చంద్రబాబు మధ్య అరగంటకుపైగా ఏకాంత భేటీ జరిగింది. వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. ఎన్టీఆర్‌ వర్థంతి అంశాన్ని అమిత్‌ షా వద్ద సీఎం ప్రస్తావించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి, అంతర్‌ రాష్ట్ర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అమిత్‌ షానే సీఎం చంద్రబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అమిత్‌ షా పాల్గొన్నారు.

జగన్‌ గురించి అమిత్ షా ఆరా..

చంద్రబాబుతో జరిగిన విందు సమయంలో జగన్‌ ప్యాలెస్‌లపై కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. జగన్‌కు ఎన్ని ప్యాలెస్‌లు ఉన్నాయని ప్రశ్నించారు. బెంగళూరు, హైదరాబాద్‌, ఇడుపులపాయ, తాడేపల్లిలో 4 ప్యాలెస్‌లు ఉన్నాయని మంత్రి లోకేశ్‌.. అమిత్‌ షాకి వివరించారు. ప్రభుత్వ డబ్బు రూ.500 కోట్లతో విశాఖలో జగన్‌ ప్యాలెస్‌ నిర్మించుకున్నాడని, ఆ ప్యాలెస్‌కు ఎన్జీటీ ఫైన్‌ విధించిందని తెలిపారు. మరి ఎన్జీటీకి జగన్‌ ఫైన్‌ కట్టారా అని అమిత్‌ షా అడగగా.. ఫైన్‌ కట్టకుండా అధికారం నుంచి దిగిపోయాడని, ఇప్పుడు ఆ భారం ప్రజలపై పడిందని సీఎం చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఎన్జీటీకి ఎప్పటికైనా ఫైన్‌ కట్టాల్సిందేనని అమిత్‌ షా స్పష్టం చేశారు.

Tags

Next Story