CBN: దటీజ్ చంద్రబాబు.. కెమెరామెన్‌ లేకుండానే ప్రెస్‌మీట్

CBN: దటీజ్ చంద్రబాబు.. కెమెరామెన్‌ లేకుండానే ప్రెస్‌మీట్
X

ఆధునిక సాంకేతికత వినియోగంలో ఎప్పుడూ ముందుండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. శనివారం వినూత్నంగా ప్రెస్‌మీట్ నిర్వహించి మరోసారి తాను హైటెక్ సీఎంను అని నిరూపించుకున్నారు. వీడియోగ్రాఫర్లు, కెమెరామెన్‌ లేకుండా.. పూర్తిగా ఏఐతో పనిచేసే వ్యవస్థను వినియోగించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో 4 కెమెరాలతో మల్టీవీడియో కెమెరా వ్యవస్థ ఏర్పాటుచేశారు. దీనిద్వారా లైవ్‌ కవరేజీ అందించారు. సమావేశ మందిరంలోకి చంద్రబాబు వచ్చిన సమయంలో ఒక కెమెరాకు సూచనలు ఇవ్వడం ద్వారా ఆయన్ను కేంద్రంగా చేసుకుంటూ అదే వీడియో రికార్డింగ్‌ మొదలుపెట్టింది. చంద్రబాబు సెంటర్‌ ఫ్రేమ్‌లో ఉండేలా చూసుకుంటూ.. అవసరమైన సర్దుబాట్లు చేసుకొని వీడియో ఔట్‌పుట్‌ ఇచ్చింది. ఎనిమిది మందితో వీడియోగ్రాఫర్లు చేసే పనిని ఈ ఏఐ కెమెరా వ్యవస్థ ద్వారా ఒక్కరితోనే పూర్తి చేయొచ్చు. దీంతో మీటింగ్ హాలులో ఎక్కువమంది అటూ, ఇటూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. ఎలాంటి గందరగోళానికి తావుండదు. నో మ్యాన్‌ విధానంలో ఆటోమేటిక్‌గా పని జరుగుతుంది.

మంత్రి లోకేశ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ ఏఐ సాంకేతిక కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ఉండవల్లి నివాసంలో ప్రభుత్వ నిధులతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేసే అవకాశమున్నా.. లోకేశ్‌ అందుకు అంగీకరించలేదు. తన సొంత నిధులతో దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

Tags

Next Story