AP: వైరస్ వ్యాప్తి వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

దేశంలో సంచలనం సృష్టిస్తున్న హెచ్ఎంపీ వైరస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ.. గైడ్‌లైన్స్ విడుదల చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్‌పై ప్రభుత్వానికి టెక్నికల్ సాయం అందించే టాస్క్‌ఫోర్స్ లేదా ఎక్స్‌పర్ట్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో మైక్రోబయాలజిస్ట్, పీడియాట్రీషియన్, శ్వాసకోస వ్యాధి నిపుణులు, ప్రివెంటివ్ మెడిసన్ ఆచార్యులు సభ్యులుగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
ముందు జాగ్రత్త చర్యలకు ఆదేశం
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. ఏపీలోకి కొత్తగా వచ్చి వెళ్లే వాళ్ళపై దృష్టి పెట్టాలని, ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్ధేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మంత్రి సత్యకుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది.. ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేశారనే వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు.
ఆందోళన చెందాల్సిన పనిలేదు
హెచ్ఎంపీ వైరస్ 2001 నుంచే ఉందని, కానీ వ్యాప్తి తీవ్రత చాలా తక్కువని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రజలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. తీవ్రమైన ఊపిరి సంబంధ సమస్యలు ఈ వైరస్ వల్ల రావని, ఇప్పటివరకూ రాష్ట్రంలో ఒక్క కేసూ నమోదు కాలేదని ముఖ్యమంత్రి తెలిపారు. వైరస్ వ్యాప్తి ఉద్ధృతి చాలా స్వల్పంగా ఉన్నందున ఇప్పటికిప్పుడు అప్రమత్తత అవసరం లేదని ఆయన చెప్పారు.
కిట్లు సమకూర్చుకోండి
వైరస్ నిర్ధారణకు సంబంధించి యూనిఫ్లెక్స్ కిట్లు వెంటనే సమకూర్చుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వైరస్ వల్ల కలిగే వ్యాధి నిర్ధారణకు రాష్ట్రంలో ఐసీఎంఆర్ వైరాలజీ ల్యాబ్లు 10 వరకూ ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. వైరస్ నిర్ధారణ కోసం జర్మనీ నుంచి 3,000 టెస్టింగ్ కిట్లను సైతం వెంటనే సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎన్-95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3.52 లక్షల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలపగా.. శానిటైజర్ రానున్న మూడు నెలలకు సరిపోయేంత సమకూర్చుకోవాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com