AP: అయిదు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జీఎస్టీ వసూళ్లపై ఆరా తీశారు.. జీఎస్టీ ఎగవేత జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. జీఎస్టీ క్లైమ్‌ల విషయంలోనూ అధికారులు అలర్ట్‌గా ఉండాలన్న ముఖ్యమంత్రి.. గత ప్రభుత్వంలో ఎక్సైజ్, గనుల వంటి శాఖలను తమ సొంత ఆదాయాలను పెంచుకునేలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బందుల్లేని పాలసీలతో అమలు చేస్తూనే.. ఆదాయం పెంచేలా చూడాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎంఎస్‌ఎంఈలపై దృష్టి
ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం ద్వారా ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులను రాబట్టాలని కూటమి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వాటి ఆధారంగా 2029 నాటికి ఐదు లక్షలకుపైగా ఉపాధి అవకాశాలను కల్పించాలని భావిస్తోంది. ఐదేళ్లలో తయారీ రంగంలో 22 లక్షల కొత్త యూనిట్లను తీసుకురావాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కొత్తగా వంద ఎంఎస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు 500లకు పైగా ఎంఎస్‌ఎంఈలను అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడేలా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదించిన ముసాయిదా పాలసీ విధివిధానాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇందులో కొన్ని కీలక మార్పులను సూచించారు. తదనుగుణంగా మార్పులు చేశాక సీఎం మరోసారి సమీక్షించనున్నారు.
‘మేడిన్ ఆంధ్రా’ బ్రాండ్
‘మేడిన్ ఆంధ్రా’ పేరిట ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాలకు సంబంధించిన కనీసం 500 ఎంఎస్‌ఎంఈలను గుర్తించి నిర్వాహకులకు అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలను కల్పించాలని భావిస్తోంది. దేశం నుంచి భారీ మొత్తంలో ఎగుమతులకు అవకాశాలున్న పది రంగాలను గుర్తించి వాటికి సంబంధించి ఎంఎస్‌ఎంఈల కోసం మార్గదర్శకాలను రూపొందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉత్పత్తుల విక్రయాల ప్రదర్శనలు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ-కామర్స్ ఎక్స్‌పోర్టుకు అనుసంధానం, బిజినెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్ వంటి అంశాల్లో సహకరించాలని భావిస్తోంది. గ్లోబల్‌ట్రేడ్ ఫెసిలిటేషన్ కల్పించేందుకు వీలుగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో మూడు కేంద్రాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com