AP: డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరు చూపించాం

ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కారు ఎలా ఉంటుందో ఏడాది పాలనలోనే చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై చంద్రబాబు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్వోడీలు, కలెక్టర్లు, ఎస్పీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు.. డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏడాది సంక్షేమంపై సమీక్ష… అభివృద్ధిపై అవలోకనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో ఏడాది పాలనపై చర్చించు కుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. సూపర్ సిక్స్‌లో ఎన్నికల హామీలు ఇచ్చామని... వాటిని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలన్న చంద్రబాబు... అస్తవ్యస్తంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థను చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అన్ని చేశామని చెప్పడం లేదన్న బాబు... ఊహించిన దాని కన్నా ఎక్కువే చేశామని వెల్లడించారు. మూడు రాజధానులు ఎక్కడా సక్సెస్ కాలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. చివరకు రాష్ట్రానికి కేపిటల్ లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. ఏ రాజకీయ నాయకుడికైనా సంపద సృష్టించి.. ఆదాయం పెంచితేనే సంక్షేమ పథకాలు అమలు చేసే హక్కు ఉంటుందన్నారు. నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని .. వైసీపీ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో స్వర్ణాంధ్ర విజన్- 2047ను లక్ష్యంగా పెట్టుకున్నామని.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించామన్నారు.
ఆటో డ్రైవర్లు, మహిళలకు గుడ్ న్యూస్
ఏపీలోని ఆటో డ్రైవర్లు, మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్ ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు ఆగస్టు 15న ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అలాగే మహిళలకు అదే రోజు నుంచి ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పామని, ఈ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు భారీగా పెరుగుతున్నాయని, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారని , ధనవంతులు ఇంకా ఇంకా ధనికులుగా మారిపోతున్నారని చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో మనతో పుట్టినవాళ్లు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారన్నారు. అలాంటి వారికి సమాజం అండగా నిలబడాలని ఆకాక్షించారు. బిల్ గేట్స్ తాను సంపాదించిన దాంట్లో 99 శాతం డబ్బులు సమాజానికే ఇస్తున్నారని చంద్రబాబు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com