CBN: పునర్విభజనపై ఆచితూచి స్పందించిన చంద్రబాబు

జనాభా తగ్గినంత మాత్రాన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వస్తుందనేవి కేవలం ఊహాగానం మాత్రమేనని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘ పునర్విభజన నిరంతర ప్రక్రియ. మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సి ఉంది. ఈవిషయంపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. ప్రస్తుతం జనాభా నియంత్రణ కన్నా జనాభా నిర్వహణపై దృష్టి కేంద్రీకరించడం అవసరం. జనాభా రాజకీయ సమస్య కానే కాదు. మాతృభాషను ప్రోత్సహించాల్సిందే.” అని చంద్రబాబు వెల్లడించారు. కేంద్రం నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతోందన్న వార్తల వేళ చంద్రబాబు దీనిపై ఆచితూచి స్పందించారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, త్రిభాషా విధానం ద్వారా హిందీని రుద్దడం ఆపేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన అన్నది ప్రస్తుతానికి ఊహాజనితమేనన్నారు.
జనాభా పెరగాల్సిందే
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనాభా నియంత్రణ పనికిరాదని... ఎక్కువ ఆదాయం వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ పిల్లలు వద్దనుకుంటారని చంద్రబాబు అన్నారు. దీనివల్ల ఇప్పుడు ప్రపంచదేశాలు మానవవనరుల నిర్వహణలో విఫలమవుతున్నాయని తెలిపారు. జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలను శిక్షించకుండా, ఎక్కువ సంతానం వైపు వెళ్లడానికి ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. త్వరలో ‘తల్లికి వందనం’ పేరుతో ఎంతమంది పిల్లలున్నా వారి చదువుకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ప్రభుత్వాలు ఇప్పుడే ఈ విధానాన్ని ప్రోత్సహించాలని... నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాల సెంటిమెంట్‌ను ఎలా కాపాడాలన్నదానిపై తాము కసరత్తు చేస్తామని వెల్లడించారు.
ఇంగ్లీష్ జీవనోపాధి మాత్రమే
ఇంగ్లీష్ జీవనోపాధికి మాత్రమే ఉపయోగపడే భాష అని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం అనాలోచితంగా ఆంగ్ల విద్యను ప్రోత్సహించిందని... నిజానికి పరిజ్ఞానం వేరు...భాష వేరని తేల్చి చెప్పారు. భాష కమ్యూనికేషన్‌కు సాధనం మాత్రమే అని... తాను ప్రతి యూనివర్సిటీలో 5 నుంచి 10 భాషలను నేర్చుకునే విధంగా ప్రోత్సహిస్తున్నానని వెల్లడించారు. అంతర్జాతీయ భాషలు నేర్చుకుని ఉపాధి కోసం ఉపయోగించుకోవచ్చన్నారు. ‘దేశంలో ఎన్ని భాషలను ప్రోత్సహించినా ఫర్వాలేదు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లిష్ తప్ప మరో భాష ఉండకూడదన్న విధానాన్ని అనుసరించింది. భాష అన్నది కేవలం మాట్లాడేందుకు సాధనం మాత్రమే, మాతృభాష ద్వారానే విజ్ఞాన సముపార్జన సాధ్యమవుతుందని మా అభిప్రాయం.” అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com