CBN: వైసీపీ హయాంలో పైసా పెట్టుబడి రాలేదు

CBN: వైసీపీ హయాంలో పైసా పెట్టుబడి రాలేదు
X
జగన్ పాలనలో అన్ని రంగాల్లో సంక్షోభం... ప్రతి కుటుంబంలోనూ ఓ పారిశ్రామిక వేత్తను తయారు చేస్తామన్న చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ హయంలో 227 ఎంవోయూలు జరిగినా ఆంధ్రప్రదేశ్ కు పైసా పెట్టుబడి రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. గత ఐదేళ్లలో పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచటం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. 1995 కంటే ముందు లైసెన్స్‌ రాజ్‌ కారణంగా పెట్టుబడులు రాలేదని... ఆ తర్వాత ఆర్థిక సంస్కరణల కారణంగా ఏపీలోనూ ఐటీని ప్రోత్సహించగలిగామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగువారే ఉన్నారంటే అప్పటి విధానపరమైన నిర్ణయమే కారణమని తెలిపారు. 2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌ దేశంగా తయారైతే ఏపీ కూడా దేశంలోనే నెంబర్‌ 1 రాష్ట్రంగా ఉండాలనే ఈ పాలసీలు తీసుకొచ్చామన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని సాధ్యం చేసి చూపుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడి ప్రాజెక్టులు అనుకున్న సమయానికే మొదలయ్యేలా ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రియల్‌ టైమ్‌లోనే అనుమతుల జారీ, సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ అంశాన్ని కూడా తీసుకురావాలని భావిస్తున్నామని వెల్లడించారు. ఉత్పత్తిలో ఏపీని గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చాలన్నది తమ విధానమని వివరించారు. ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీని.. అన్ని రాష్ట్రాల విధానాల్ని అధ్యయనం చేసి రూపొందించామని చంద్రబాబు తెలిపారు.


పరిస్థితులు మారాయ్

గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయాని అన్నారు సీఎం చంద్రబాబు. ఇంటి దగ్గరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామన్న సీఎం చంద్రబాబు.. ఉత్పత్తి వ్యయం తగ్గించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కాన్సెప్ట్‌లో సోలార్ ప్యానెల్స్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు సీఎం. ఈమధ్యే రిలయన్స్ గ్రూప్‌, ఏపీ ప్రభుత్వంతో MOU కుదుర్చుకుందన్న సీఎం చంద్రబాబు రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పించేలా 65 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి GST బెనిఫిట్స్ వస్తాయన్నారు.

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

దేశ రాజధాని ఢిల్లీకి నేడు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు ఢిల్లీకి ప్రయాణం కానున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బాబు పాల్గొననున్నట్లు సమాచారం. 16, 17వ తేదీల్లో చంద్రబాబు మహారాష్ట్రలో ప్రచారం చేయనున్నారు.

Tags

Next Story