CBN: అన్ని దేశాల్లో తెలుగు ప్రజల ముద్ర

ప్రపంచం నలుమూలల స్థిరపడిన తెలుగువారు రాణించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని.. అందుకే రాజకీయాల్లో యువతను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగు ప్రజల ముద్ర ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. గ్లోబల్ లీడర్లుగా తెలుగు ప్రజలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో ‘స్విస్ తెలుగు డయాస్పోరా’ నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. దాదాపు అన్ని దేశాల్లో తెలుగువారి ముద్ర ఉంటుందని చెప్పారు. తెలుగువారు ఎక్కడైనా రాణించగలుగుతారని అన్నారు. తెలుగు వారికి నైపుణ్యం, పట్టుదల ఎక్కువ అని చంద్రబాబు తెలిపారు. తాను గతంలో రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు మీరంతా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.
కష్టపడితేనే ఈ స్థాయికి..
ఐరోపాలోని 12 దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు హాజరైన సమావేశంలో చంద్రబాబు కీలక సూచనలు చేశారు. తెలుగువారు కష్టపడి ఈ స్థాయికి చేరారని చంద్రబాబు కొనియాడారు. ఇక్కడి నుంచి మీరంతా ప్రపంచస్థాయి నాయకులుగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. మీరున్న చోటు కర్మ భూమని.. అలాగే జన్మభూమి అభివృద్ధికీ మీ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఇక్కడి కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఫిజికల్‌గా, వర్చువల్‌గా తాము అందిస్తామని... తెలుగు ప్రజలను గ్లోబల్ లీడర్లుగా ఎదిగేలా తీర్చిదిద్దేందుకు ఒక ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఐరోపాలోని తెలుగువారికి ఉన్న అవకాశాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
భారత రాయబారితో భేటీ
జ్యూరిచ్ హిల్టన్ హోటల్లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం భేటీలు నిర్వహించింది. ఏపీ ఫార్మా రంగంలో పెట్టుబడులకు సహకరించాలని.. స్విస్ రాయబారి మృదుల్ కుమార్‌ను చంద్రబాబు బృందం కోరారు. అనంతరం తెలుగు కమ్యూనిటీతో చంద్రబాబు 'మీట్ అండ్ గ్రీట్' నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com